మాటిమాటికీ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచామని టీఆర్ఎస్ వాళ్లు మాపై నిందలు వేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ను దించేయడం అనేది వెన్నుపోటుకాదు, ఒకవేళ దాన్ని వెన్నుపోటు అని అంటే... దాంట్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుకూడా వాటా ఉంది.. అని అంటున్నాడు తెలంగాణ తెలుగుదేశం నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈమేరకు టీఆర్ఎస్ పై ధ్వజమెత్తుతూ విరుచుకుపడ్డాడు. ప్రత్యేకించి హరీశ్ రావును ఎర్రబెల్లి టార్గెట్ చేసుకొన్నాడు. ఎన్టీఆర్ ను దించేసిన అంశం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే హరీశ్ రావు వెళ్లి తన మేనమామనే అడగాలని ఎర్రబెల్లి అంటున్నాడు. ఈమాటల ద్వారా నాడు ఎన్టీఆర్ ను దించేసినప్పుడు కేసీఆర్ కూడా చంద్రబాబు వెంటే ఉన్నాడన్న విషయాన్ని ఎర్రబెల్లి గుర్తుచేయదలిచినట్టుగా ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ ను తాము పదవి నుంచి దించేయడాన్ని వెన్నుపోటు అని అనలేమని ఎర్రబెల్లి చెబుతున్నాడు. అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అది జరిగింది తప్ప.. మరేమీ కాదని ఎర్రబెల్లి వ్యాఖ్యానించాడు. మొత్తానికి శంషాబాద్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న డిమాండ్ కాస్తా... వెన్నుపోటు మీద చర్చగా మారింది!అందులో కేసీఆర్ ప్రమేయం కూడా ఉందని తెలుగుదేశం నేతలు సెలవిస్తున్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ ఆ అంశం గురించి నోరువిప్పుతాడా? నాటి పరిస్థితుల గురించి ప్రస్తావిస్తాడా? వివరణ ఇస్తాడా?!

మరింత సమాచారం తెలుసుకోండి: