తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచిన ఏకైక ఎంపీగా వైకాపా ఉనికిని నిలుపుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి లోక్ సభలో యాక్టివ్ గా కనిపిస్తున్నాడు. ఒక విపక్ష పార్టీ ఎంపీగా కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి ప్రశ్నలు సంధిస్తూ పొంగులేటి తన బాధ్యతను నెరవేస్తున్నాడు. తద్వారా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.లోక్ సభ శీతాకాల సమావేశాల సందర్భంగా పొంగులేటి రెండో రోజున మూడు ప్రశ్నలను అడిగాడు. కేంద్ర ప్రభుత్వ విధానాల విషయంలో ఆయన వివరణ అడిగాడు. అది కూడా మూడు భిన్నమైన అంశాల గురించి ఆయన మాట్లాడటం విశేషం. విశృంఖలంగా రెచ్చిపోతున్న పోర్నోగ్రఫీ సైట్ల ను కట్టడి చేయడానికి కేంద్రం తీసుకొంటున్న చర్యలు ఏమిటి? అని పొంగులేటి ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. యువతపై దుష్ర్పభావాన్ని చూపే ఈ సైట్లను అడ్డుకట్ట వేయడానికి తీసుకొంటున్న చర్యల గురించి ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక వివరణ వచ్చింది. అలాగే చిన్ననగరాల్లో విమానాశ్రయాల ఏర్పాటు గురించి కూడా పొంగులేటి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. కేజీ బేసిన్ లో గ్యాస్ వెలికి తీత గురించి ఆయన ప్రభుత్వం నుంచి వివరణ కోరాడు. ఈ విధంగా సభలో కొన్ని వ్యాలిడ్ పాయింట్లను పొంగులేటి రైజ్ చేస్తున్నాడని చెప్పవచ్చు. సభ లో మాత్రమే కాకుండా... బయట కూడా తన నియోజకవర్గం మీద పొంగులేటి దృష్టి సారించినట్టుగా ఉన్నాడు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడిని కలిసి ఖమ్మంను స్మార్ట్ సిటీలుగా తీర్చే నగరాల జాబితాలో కలపాలని పొంగులేటి కోరాడు. తన నియోజకవర్గ కేంద్రంలోని సమస్యలను ప్రస్తావిస్తూ పొంగులేటి చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరాడు. తద్వారా తను యాక్టివ్ మెంబర్ నే అని ఉనికిని చాటుకొంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: