రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇబ్బందుల్లో పడుతోంది. ఆదాయం కన్నా, ఖర్చు ఎక్కువ కావడంతో రానున్న రోజుల్లో క్లిష్ట పరిస్థితి తప్పదని ఆర్ధికశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన రాష్ట్ర బడ్జెట్ కొరత నిధులు రావడమో లేదా ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లడమో తప్ప మరో గత్యంతరం కనిపించడం లేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆర్ధిక సంవత్సరంలో తొలి రెండు నెలల భారం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఖజానాపైనే పడటం, తరువాత కాలంలో ఊహించని విధంగా ఖర్చులు, బిల్లుల చెల్లింపులు జరగడం వల్ల ఆర్ధికంగా ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతోందని నిపుణులు విశే్లషిస్తున్నారు. దీనికితోడు రాష్ట్ర విభజన చట్టంలో రెండు రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితిని అధ్యయనం చేసిన కేంద్రం, తెలంగాణలో మిగులు ఉన్నట్లు గుర్తించగా, ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 15 వేల కోట్లు కొరత ఉన్నట్లు ప్రకటించింది. కొరత నిధులను నేరుగా కేంద్రమే భరించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు. అది కూడా ఇబ్బందులకు కారణంగా కనిపిస్తోంది. ఈ మొత్తాన్ని త్వరగా రప్పించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఇక ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్లడం తప్ప గత్యంతరం లేదని అధికారులు అంటున్నారు.  ఏప్రిల్ నుంచి ఆదాయ వ్యయాలను పరిశీలిస్తే ప్రణాళికేతర వ్యయంలో గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ 25 వరకు ఉమ్మడి రాష్ట్రంలో 32,319 కోట్లు ఖర్చు చేయగా, ఈ ఏడాది అదే కాలంలో కేవలం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో 36,969 కోట్లు ఖర్చు చేశారు. ప్రణాళికా రంగంలోనూ గత ఏడాది ఉమ్మడి రాష్ట్రంలో 17,886 కోట్లు ఖర్చు చేయగా, ఈ ఏడాది కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏకంగా 19,890 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం పరిశీలిస్తే ఉమ్మడి రాష్ట్రంలో 50,200 కోట్లు ఖర్చు చేయగా, కొత్త రాష్ట్రంలో ఏకంగా 56,849 కోట్లు ఖర్చు చేశారు. అందులో ఈ ఆర్ధిక సంవత్సరంలోని తొలి రెండు నెలల ఖర్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైనే పడటంతో ఖర్చు పెరిగినట్లు అంచనా. రాష్ట్ర విభజన జరిగిన జూన్ రెండు నుంచి గణాంకాలు పరిశీలిస్తే గత ఏడాది ఉమ్మడి రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ప్రణాళిక, ప్రణాళికేతర రంగాల్లో కలిపి 31,787 కోట్లు ఖర్చు చేయగా, ఈ ఏడాది కేవలం 13 జిల్లాల విభజిత ఆంధ్రప్రదేశ్‌లోనే 32,041 కోట్లు ఖర్చు కావడం విశేషం. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం కన్నా చేస్తున్న ఖర్చు భారీగా కనిపిస్తోంది. ఈ ఏడాది సొంత పన్నులు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కు 32 వేల కోట్లు రాగా, ఖర్చు 56 వేల కోట్లు కావడం గమనార్హం. అయితే కేంద్రం నుంచి కూడా కొంత నిధులు రావడం వల్లనే తేడాలో కొంత మార్పులు ఉన్నట్లు కనిపిస్తోంది. ఖజానాలో నిల్వ తగ్గుతోంది! ఇక ఖజానాలో ఉండాల్సిన సొమ్ములో కూడా తగ్గుదల కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు చూసినా కనీసం ఆరు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉండాల్సిన నిల్వ ఇప్పుడు రెండు వేల కోట్లకు తగ్గిపోయినట్లు సమాచారం. గత మూడు నెలలుగా బిల్లుల చెల్లింపులు ఎక్కువ కావడం, హుదూద్ వంటి అనుకోని ఘటనలతో ఖర్చులు పెరగడం వల్ల ఖజానా నిల్వలు అడుగంటుతున్నాయి. ప్రతి నెలా కనీసం 4500 నుంచి ఐదు వేల కోట్ల రూపాయల వరకు బిల్లులపై ఖర్చు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే జనవరి నుంచి ప్రారంభమయ్యే చివరి త్రైమాసికంలో ఉద్యోగుల జీతాలు, పింఛన్లకు కూడా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొరత నిధులు కేంద్రం నుంచి రావాలి.. లేదా అప్పులు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే జీతాల సమస్య నివారించవచ్చునని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: