ఆధునిక యుగంలో అభివృద్ధి అంతా పవర్ చుట్టూనే ఉంటుంది. పవర్ అంటే ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. రాజకీయం ఒకటి.. విద్యుత్ మరొకటి.. రాజకీయంతో అభివృద్ధి కంటే.. విద్యుత్ తోనే అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఎందుకంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. పాలసీలు దాదాపు ఒకటే మెయింటైన్ చేస్తున్నాయి. కానీ తగినంత విద్యుత్ అందుబాటులో లేకపోతే మాత్రం అభివృద్ధి కుంటుపడటం ఖాయం.                               అంతటి ప్రాముఖ్యం ఉన్న విద్యుత్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఓ ఘనత సాధించింది. అదేంటంటే.. చాలా రోజుల తర్వాత ఏపీ మిగులు విద్యుత్ సాధించింది. శీతాకాలంలో విద్యుత్‌ డిమాండ్‌ తగ్గడం... కృష్ణపట్నంలోని తొలి యూనిట్‌లో తిరిగి ఉత్పత్తి మొదలుకావటం వల్ల ఆంధ్రప్రదేశ్‌ సర్కారు.... విద్యుత్‌లో మిగులు రాష్ట్రమైంది. అందుకే బయట నుంచి కోనుగోళ్లను తగ్గించుకుంటోంది. ప్రస్తుతం మిగులుతున్న విద్యుత్ ను ఇతరులకు అమ్మే విషయంపైనా దృష్టిసారించిందట. ఎలాగూ విద్యుత్ మిగులుతోంది కనుక.. ఒకట్రెండు థర్మల్‌ విద్యుత్ యూనిట్లలో ఉత్పత్తిని నిలిపివేసి... పూర్తి స్థాయి నిర్వహణ పనుల్ని చేపట్టాలన్న ఆలోచన చేస్తోంది.                   రాష్ట్రం విడిపోయిన మొదట్లో.. ఏపీలో రోజుకు 22 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొరత ఉండేది. అదనంగా విద్యుత్‌ కొనుగోలు చేయటం... కేంద్రం నుంచి ఎక్కువగా తెచ్చుకోవటం , బొగ్గును అందుబాటులోకి తెచ్చుకోవటం వంటి చర్యల ద్వారా ఈ కొరతను ఏపీ అధిగమించింది. నవంబర్‌ మొత్తం మీద ఒకరోజు మాత్రమే...రోజు 7 మిలియన్‌ యూనిట‌్ల లోటు ఏర్పడింది. ఆంధ్రాలోని దక్షిణ, తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థల పరిధిలో ప్రస్తుత డిమాండ్‌ 800 మెగాయూనిట్లకు పైగా తగ్గినట్లు అంచనా. శీతాకాలం దాటితే మళ్లీ కొరత తలెత్తే అవకాశం ఉన్నా.. తాత్కాలికంగానైనా విద్యుత్ మిగులు రాష్ట్రంగా నిలుస్తోంది. ఈ పరిస్థితి తమకు ఎప్పుడు వస్తుందోనని తెలంగాణ కూడా ఎదురుచూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: