రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు నిట్టనిలువుగా చీలిన నేపథ్యంలో.. అసెంబ్లీలోనూ అదే సీన్ రిపీటైంది. ఉన్న భవనాలనే రెండు రాష్ట్రాలు కలసి పంచుకున్నాయి. ప్రస్తుతం తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్న హాలులో 300 సీట్లున్నాయి. సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు 294 మంది శాసనసభ్యుల కోసం ఈ సీట్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజనతో శాసనసభలో సభ్యుల సంఖ్య 119 అయింది. చాలా సీట్లు మిగిలిపోతున్నాయి కాబట్టి.. సీట్లను మరింత విశాలంగా తయారు చేయించుకోవాలని తెలంగాణ నేతలు ప్లాన్ చేస్తున్నారు.                  సీట్ల సర్దుబాటు విషయంపై రోడ్లు, భవనాల శాఖ అధికారులతో శాసన సభాపతి మధుసూదనా చారి, సభా వ్యవహారాల మంత్రి హరీశ్ రావు భేటీ అయి నిర్ణయం తీసుకున్నారు. విభజన చట్టం ప్రకారం శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 153కు పెరగాల్సి ఉంది. అయితే నియోజకవర్గాల పునర్ విభజన ప్రక్రియ వచ్చే సాధారణ ఎన్నికల నాటికి జరుగుతుంది.                   ఐదేళ్ల సమయం ఉన్నందున ముందుగానే ఆ దిశగా సీటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. సీట్ల సంఖ్య తగ్గుతున్నందున... ల్యాప్ టాప్, దస్త్రాలు, పుస్తకాలు, పేపర్లులాంటి వాటిని కూడా ఎమ్మెల్యేలు తమ స్థానం ముందు పెట్టుకునేలా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు స్పష్టంచేశారు. వచ్చే ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల నాటికి సీటింగ్ మార్పులు పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.                    అటు.. ఏపీ విషయానికి వచ్చేసరికి.. అసెంబ్లీ సమావేశాల హాలు ఇరుగ్గా ఉందన్న కామెంట్లు సమావేశాల సందర్భంగా వినిపించింది. దీనికి తోడు సొంత రాష్ట్రంలోనే అసెంబ్లీ సమావేశాలు జరుపుకోవాలన్న కాంక్ష సభ్యుల్లో పెరుగుతోంది. మొన్నటికి మొన్న గుంటూర్లోని నాగార్జున యూనివర్శిటీ భవనాలను శీతాకాల సమావేశాల కోసం పరిశీలించారు. మరోవైపు గుంటూరు, విశాఖ, తిరుపతిల్లో రొటేషన్ పద్దతిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న ప్రతిపాదన ఉంది. వీటిపై ఓ క్లారిటీ వచ్చేవరకూ ఏపీ అసెంబ్లీ సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కిరాకపోవచ్చు.. ఎలాగూ శాశ్వతంగా ఉండేది లేదు కాబట్టి.. సర్దుబాటు కూడా ఎందుకు దండుగ అన్న అభిప్రాయం కొందరు నేతల్లో ఉంది. మరి ఏపీ నేతలు ఏం డిసైడ్ చేస్తారో..?

మరింత సమాచారం తెలుసుకోండి: