సిడ్నీలో దేశవాళీ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా ఫాస్ట్ బౌలర్ షాన్ అబాట్ వేసిన ఓ బౌన్సర్ బలంగా తాకడంతో గత కొన్ని రోజులుగా కోమాలో ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ (25) నేటి ఉదయం మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ ఫిల్ హ్యూస్‌ త్వరగా కోలుకోవాలని అభిమానులు చేసిన ప్రార్థనలు ఫలించలేదు. హ్యూస్ మృతితో క్రికెట్ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఆస్టేలియా తరపున ఫిల్ హ్యూస్‌ 26 టెస్టులు, 25 వన్డేలు, ఒక ట్వంటీ 20 మ్యాచ్ ఆడాడు. డిసెంబర్ 4 నుంచి ఇండియాతో జరగనున్న టెస్టు సిరీస్ పిలుపు కోసం వేచిచూస్తున్న తరుణంలో ఈ దుర్ఘటన జరిగింది. ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ మృతికి ఎందరో సంతాపం తెలిపారు. ఆసీస్ జాతీయ జట్టు కోచ్ డారెన్ లెహ్మన్, హ్యూస్ కుటుంబానికి తన సానుభూతి తెలియజేశారు. "లిటిల్ చాంప్... అందరం నిన్ను మిస్సవుతున్నాం" అంటూ పేర్కొన్నారు. హ్యూస్ ఆత్మకు శాంతి కలగాలని మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ ట్వీట్ చేశాడు. ఎంత భయంకరమైన వార్త ఇది అని పేస్ లెజెండ్ గ్లెన్ మెక్ గ్రాత్ పేర్కొన్నాడు. సొంత జట్టు సౌత్ ఆస్ట్రేలియా హ్యూస్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసింది. ఇక, ఇతర దేశాల క్రికెటర్లు కూడా హ్యూస్ కన్నుమూతపై స్పందించారు. శ్రీలంక క్రికెట్ మూలస్తంభం మహేల జయవర్థనే ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపాడు. ఇప్పుడే ఈ విషాదకర వార్త విన్నామని, అతని కుటుంబం కోసం ప్రార్థిస్తున్నామన్నాడు. "హార్ట్ బ్రోకెన్" అంటూ దక్షిణాఫ్రికా వన్డే జట్టు సారథి ఏబీ డివిలీర్స్ ట్వీట్ చేశాడు. అటు, క్రికెట్ వర్గాలే కాకుండా, ఆస్ట్రేలియా రగ్బీ, సాకర్ క్లబ్ లు కూడా హ్యూస్ మృతికి సంతాపం తెలిపాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: