జపాన్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. గత నాలుగు రోజులుగా జపాన్‌లో పర్యటిస్తున్న చంద్రబాబు గురువారం అక్కడి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రధానంగా సుమిటోమో సంస్థతో ఇందుకు సంబంధించి సంతకాలు జరిగాయి. వ్యవసాయ రంగానికి సంబంధించి రాష్ట్రంలో వనరుల వెలికి తీతపై అధ్యయనం చేసేందుకు ఉమ్మడి బృందాన్ని ఏర్పాటుచేసుకునేందుకు నిర్ణయించారు.్భరతదేశంలో రెండో అతి పెద్ద వ్యవసాయ ఉత్పత్తుల రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో అనేక వ్యవసాయ వనరులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉత్పత్తిని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉమ్మడి బృందం అధ్యయనం చేస్తుంది. అలాగే విద్యుత్ రంగంలో తక్షణమే విద్యుదుత్పత్తిని పెంచేందుకు కూడా మరొక ఒప్పందం కుదిరింది. శ్రీకాకుళం జిల్లా నాలుగు వెయ్యి మెగావాట్ల సామర్ధ్యం ఉన్న విద్యుత్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఆధునిక విధానాలు అవలంభించేందుకు జపాన్ సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. దీనిపై కూడా ఒక ఒప్పందం కుదిరింది. ఆహార ఉత్పత్తులకు సంబంధించి విదేశీ పెట్టుబడులు పెట్టేందుకు మరొక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక అత్యంత కీలకంగా భావిస్తున్న రాజధాని నిర్మాణంలో కూడా అంతర్జాతీయ స్థాయిలో స్మార్ట్ సిటీని నిర్మించేందుకు అవసరమైన సహాయం అందించేందుకు సుమిటోమోతో ఒప్పందం కుదిరింది. దీనికోసం ఒక బృందాన్ని సర్వేకు పంపించాలని నిర్ణయించారు. ఇలా ఉండగా, మరో భేటీలో ఇసుజీ మోటార్స్ సంస్థ కూడా రాష్ట్రంలో భారీ ట్రక్కుల ప్రాజెక్టును ఏర్పాటుచేసేందుకు ముందుకు వచ్చింది. సంస్థ ఉపాధ్యక్షుడు మసనోరి కటయామతో జరిగిన భేటీలో రాష్ట్రంలో ఇసుజి ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చించారు. ప్రపంచంలో ఈ సంస్థకు పది ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. దేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నట్లు మసనోరి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని శ్రీసిటీ తమ ప్రాజెక్టుకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా మసనోరి పేర్కొన్నారు. దేశంలో ఇసుజికి మార్కెట్ బాగుంటుందని, దీనికోసం సహకారం కావాలని చంద్రబాబును కోరారు. ఇదే సమయంలో జపాన్ నుంచి మరికొన్ని చిన్న, మధ్యస్థాయి సంస్థలు కూడా రాష్ట్రానికి వచ్చేలా చూడాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. తమ రాష్ట్రంలో ఎర్రతివాచీతో ఆహ్వానం పలుకుతామన్నారు. ఇలా ఉండగా, మయెవాక సంస్థతో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫుడ్ పార్కులను ఏర్పాటుచేసేందుకు సహకారం అందించేందుకు సంస్థ ముందుకు వచ్చింది. అలాగే ఆసుపత్రుల్లో రిఫ్రిజిరేషన్ కంప్రెసర్లను ఉపయోగించేలా కూడా చర్యలు చేపట్టనున్నట్లు సంస్థ చైర్మన్ తనాకా వెల్లడించారు. కాగా, వివిధ పథకాలకు రుణాలు అందించే జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ) ప్రతినిధులతో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. జపనీస్ ఇండస్ట్రియల్ పార్క్‌ను రాష్ట్రంలో ఏర్పాటుచేసేందుకు ప్రత్యేక అథారిటీని ఏర్పాటుచేయాలని చంద్రబాబు కోరారు. జైకా సీనియర్ ఉపాధ్యక్షుడు హడీరి దొమిచి కూడా వివిధ అంశాలపై సానుకూలంగా స్పందించారు. బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్‌పై తాము ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే కృష్ణపట్నం ఓడరేవు నిర్మాణానికి కూడా సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌పై గట్టి విశ్వాసం ఉందని దొమిచి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌తోపాటు, ఔటర్ రింగు రోడ్డు, ఇతర అంశాలకు తాము ఆర్ధిక సహకారం అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో భూమి అందుబాటులో ఉందని, వివిధ సంస్థలకు అనుమతులు కూడా త్వరగా ఇచ్చేలా చూస్తున్నామని చంద్రబాబు వివరించారు. పారిశ్రామిక వాడలు, పోర్టులకు రహదారి సౌకర్యాలు కల్పించేందుకు సాయం అందించాలని చంద్రబాబు కోరారు. ఇక జపాన్‌లో పమరో ప్రధాన ఆర్ధిక సంస్థగా ఉన్న జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ (జెబిఐసి)తో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో వివిధ నగరాల మధ్య రవాణా అనుసంధానంకోసం, పట్టణ ప్రాంతాల్లో నీటి నిర్వహణపై సహకారానికి జెబిఐసి సానుకూలంగా స్పందించింది. సింగపూర్ దేశం కొత్త రాజధాని నిర్మాణానికి ముందుకు వచ్చిందని, వారితో కలిసి పనిచేసేందుకు జపాన్ కూడా సంసిద్ధత వ్యక్తం చేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అనంతరం యొకహామా ఓడరేవు, ఇతర ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిపై కూడా చంద్రబాబు బృందం అధ్యయనం చేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: