తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఎంతో ప్రేమాభిమానాలను చూపిస్తున్నాడు. అవసరమైన సందర్భాల్లో వారిని ప్రశంసించడానికి, బుజ్జగించడానికి కూడా కేసీఆర్ వెనుకాడటం లేదు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇలాంటి దృశ్యాలు ఆవిష్కృతం అవుతున్నాయి. ఇది వరకూ తెలంగాణ సీఎల్పీ లీడర్ జానారెడ్డిపై కేసీఆర్ తన గౌరవాన్ని ప్రకటించుకొన్నాడు. జానారెడ్డిని పెద్దాయన గా గుర్తిస్తూ కేసీఆర్ గౌరవిస్తున్నాడు. మరి ఆయన సంగతి అలా ఉంటే.. తాజాగా కోమటిరెడ్డి వెంకట రెడ్డిని బుజ్జగించడం, గీతారెడ్డిని ప్రశంసించడం జరిగింది. తనకు సభలో మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదని అంటూ కోమటిరెడ్డి అలిగి బయటకు వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా ఆయన రాజీనామా చేస్తానని కూడా హెచ్చరించాడట. ఈ విషయాన్ని తెలుసుకొని కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యే ఒకరిని బయటకు పంపి.. కోమటిరెడ్డిని బుజ్జిగించమన్నాడట. తను చెప్పానని చెప్పి.. కోమటిరెడ్డిని సభలోకి పిలిపించుకొన్నాడట. ఇదే రోజునే సభలో గీతారెడ్డిని కూడా కేసీఆర్ ప్రశంసించడం ఆసక్తికరంగా మారింది. పారిశ్రామిక విధానం విషయంలో గీతారెడ్డి పలు సూచ నలు, సలహాలు చేశారు. పదిహేను రోజుల్లో అనుమతులు అనేది సాధ్యం అయ్యే విషయం కాదని గీతారెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ స్పందిస్తూ.. గీతారెడ్డి సలహాలను స్వీకరిస్తామని అన్నాడు. ఆమె వెటరన్ లీడర్ అని, సింగిల్ లీడర్ అని కేసీఆర్ ప్రశంసించాడు. దీంతో గీతారెడ్డి కూడా స్మైల్ ఇచ్చింది. పారిశ్రామిక విధానం గురించి సలహాలు ఇవ్వడానికి అవకాశం రావడం తనకు ఆనందాన్ని కలిగిస్తోందని ఆమె వ్యాఖ్యానించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: