కొన్ని నెలలుగా టీఆర్ఎస్ నేతలను ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఖారారైంది. 16వ తేదీన మంత్రివర్గాన్ని విస్తరించాలని కేసీఆర్ నిర్ణయించారు. కొత్త మంత్రులుగా ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మలనాగేశ్వరరావు.. పాలమూరు జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు, మరో నేత లక్ష్మారెడ్డి పేర్లు ఖరారయ్యాయి. వీరితో పాటు కొండాసురేఖ, చందూలాల్, ఇంద్ర కరణ్ రెడ్డి, కోవాలక్ష్మి, తలసాని శ్రీనివాసయాదవ్ లలో ముగ్గురికి అవకాశం దక్కనుంది. మొత్తం ఆరు కొత్త ముఖాలు తెలంగాణ మంత్రివర్గంలోకి రాబోతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మలకు హోంశాఖ దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది.                                        మంత్రివర్గ విస్తరణతో పాటు అనేక నామినేషన్ పోస్టులు భర్తీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. మంత్రివర్గ పదవులపై ఆశలు పెట్టుకున్నవారికి ఊరట ఇవి లభించనున్నాయి. ఖమ్మం జిల్లాలో పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే జలగం వెంకట్రావు.. మంత్రిపదవిపై ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్నారు. తుమ్మల రాకతో ఆయనకు అవకాశాలు సన్నగిల్లాయి. ఈయనతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగసంఘాల నేత.. ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ కూడా మంత్రిపదవి ఆశించారు. వీరిద్దరికీ.. పార్లమెంటరీ సెక్రటరీ అనే కొత్త పోస్టులు సృష్టించి సంతృప్తి పరిచారు. ఈ పదవి సహాయమంత్రి పదవి హోదా ఉంటుంది.                     మంత్రిపదవి ఆశిస్తున్న కొప్పుల ఈశ్వర్ కు చీఫ్ విప్ పదవి కట్టబెట్టారు. మరో ఆరుగురు ఎమ్మెల్యేలకు కార్పొరేషన పదవులు కట్టబెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణకు చెందిన పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ, ఆర్టీసీ, వైద్య మౌలిక సదుపాయాల సంస్థ.. వంటి కార్పొరేషన్లకు త్వరలోనే ఛైర్మన్ లను నియమించనున్నారు. నెలాఖారులోగా వీటి ఛైర్మన్ ఎంపిక పూర్తవనుంది. మంత్రివర్గ పదవులు, నామినేటెడ్ పదవులు , పార్లమెంటరీ సెక్రటరీలు కలుపుకుని.. పార్టీ ఎమ్మెల్యేల్లో మెజారిటీ సభ్యులకు ఏదో ఒక పదవి కట్టబెట్టాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. మూడింట రెండొంతుల మందినైనా సంతృప్తి పరిస్తే.. పార్టీపరంగా ఇబ్బందులుండవని ఆలోచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: