వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్... శనివారం సొంతజిల్లా కడపలో విస్తృతంగా పర్యటించారు. పులివెందులతోపాటు ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. పలువురు పింఛన్లు కోల్పోయిన వృద్ధులు, రుణమాఫీ లిస్టులో పేర్లు లేని రైతులు, డ్వాక్రా మహిళలను ఆయన కలిశారు. పులివెందుల నుంచి ప్రొద్దుటూరు వరకూ గ్రామగ్రామాన జగన్ కు ఘన స్వాగతం పలికారు. ముద్దనూరు, చిలంకూరు, నిడ్జివి, యర్రగుంట్ల జనం రోడ్డుపై బారులు తీరారు.                              సొంత జిల్లాలో జగన్ కు ఈ అభిమానం సాధారణమే.. సొంత జిల్లాయేకాదు. జగన్ ఏపీలోని ఏ జిల్లాకు వెళ్లినా.. ఎప్పుడూ జనం రాలేదన్న ఫిర్యాదు లేదు. మొన్నటి విశాఖ ధర్నా కార్యక్రమానికీ జనం బాగానే వచ్చారు. కాకపోతే.. ప్రతిపక్ష నేతగా జగనే విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అడపాదడపా వెళ్లినా.. కొన్ని గంటలకే ఆ కార్యక్రమాలు పరిమితం అవుతున్నాయి.                          చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 60 ఏళ్ల వయసులోనూ విస్తృతంగా పర్యటించేవారు..మీ కోసం.. నాకోసం.. వాళ్ల కోసం.. వీళ్ల కోసం.. అంటూ ఏదో ఒక కార్యక్రమం పేరుతో ప్రజల్లో ఉండేవారు. జగన్ మాత్రం ఎందుకో సొంత జిల్లాకే పరిమితం అవుతున్నట్టు కనిపిస్తోంది. దీనికి తోడు.. కారణాలు ఏమైనా.. చంద్రబాబు ఎన్నికల హామీలను నెరవేర్చడం లేదు. ఈ అంశాలపై జనంలోకి విస్తృతంగా వెళ్లడంలో జగన్ విఫలమవుతున్నట్టు కనిపిస్తోంది. లేకపోతే.. ఎన్నికలు ఇంకా నాలుగేళ్లు ఉన్నాయిగా.. అప్పుడే తిరిగితే పోలా.. ఇప్పటి నుంచే ఎందుకని భావిస్తున్నారో ఏమో..

మరింత సమాచారం తెలుసుకోండి: