విదేశాంగ విధానంలో మోడీ దూసుకుపోతున్నారు. ప్రధానిగా ఆరు నెలల పదవీకాలం పూర్తయిందో లేదో.. అప్పుడే.. అరడజను వరకూ దేశాలు చుట్టేశారు. గత ప్రధానుల కంటే భిన్నంగా.. వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. ఎన్నారై ప్రధాని అని విపక్షాలు విమర్శించే స్థాయికి చేరుకున్నారు. కేవలం పర్యటనల్లోనేకాదు.. అంతర్జాతీయ గుర్తింపులోనూ మోడీ ముందున్నారు. ఆసియన్ మేన్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికయ్యారు. టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ రేసులో అగ్రస్థానంలో నిలిచారు.                               ఇటీవలి కాలంలో ఇండియా- అమెరికా సంబంధాలు మరింత దగ్గరవుతున్నాయి. మోడీ తన అమెరికా పర్యటన ద్వారా వీటిని మరింత బలోపేతం చేశారు. అంతేకాదు... తొలిసారిగా .. భారత రిపబ్లిక్ ఉత్సవాలకు ఓ అమెరికా అధ్యక్షుడిని ఆహ్వానించి చరిత్ర సృష్టించారు. ఒబామా కూడా ఆయన ఆహ్వానాన్ని మన్నించారు. ఐతే.. ఓవైపు అమెరికాతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే పాత మిత్రుడు రష్యాతో అపూర్వ మైత్రీబంధాన్ని కొనసాగిస్తున్నారు మోడీ.                             ఇటీవల భారత్ వచ్చిన రష్యాతో భారత్ అనేక వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంది. అంతేకాదు.. రష్యా భారత రక్షణరంగ భాగస్వామి అని మోడీ బాహాటంగా ప్రకటించారు. రష్యా, అమెరికాల వైరం సంగతి తెలిసిందే..ప్రచ్చన్నయుద్దం తర్వాత.. ఆ స్థాయిలో విద్వేషాలు లేకపోయినా.. వాటి ఆనవాళ్లు ఇంకా మిగిలే ఉన్నాయి. అందుకేనేమో.. రష్యాతో భారత్ ఒప్పందాలపై అమెరికా తాజాగా విమర్శలు గుప్పించింది. అంతర్జాతీయంగా రష్యాపై ఆంక్షలు ఉన్నందువల్ల.. భారత్ అలా చేయకుండా ఉండాల్సిందని విమర్శించింది. మరి మోడీ అటు ఒబామాను..ఇటు పుతిన్ ను ఎలా మెప్పిస్తారో..

మరింత సమాచారం తెలుసుకోండి: