చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి రైతుసంఘాలు డెడ్ లైన్ విధించాయి. పట్టిసీమ వద్ద ఎపి ప్రభుత్వం ఏర్పాటుచేయనున్న ఎత్తిపోతల పథకం ఆలోచనను డిసెంబర్ 31వ తేదీ లోపు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే జనవరి 1 నుండి ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని రైతు సంఘాలు శనివారం సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో ముఖ్యమైన రైతుసంఘాలు, ప్రతినిధులు హజరయ్యారు. ఈ సమావేశంలో వాడివేడిగా సాగింది. ఇప్పటికే పట్టిసీమ వద్ద ప్రభుత్వం ఏర్పాటుచేయనున్న ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశం తీర్మానించిన సంగతి తెలిసిందే. అదే ఊపుతో ముందుకు వెళ్ళాలని రైతుసంఘాలు నిర్ణయించుకున్నాయి. ఈ ఎత్తిపోతల పథకం వల్ల గోదావరి జిల్లాలు ఎడారిగా మారనున్న నేపథ్యంలో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమైన అంశాలపై చర్చించిన వీరు కార్యచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ముందుగా రైతులతో సమావేశాలు నిర్వహించాలి. ప్రభుత్వం ఏర్పాటుచేయనున్న ఎత్తిపోతల పథకం వల్ల ఏ విధంగా నష్టం జరిగే అవకాశముందో వారికి వివరిస్తారు. రైతుకు మేలు చేస్తానని గద్దె ఎక్కిన చంద్రబాబు ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేయనున్నారు. జనవరి 1 నుంచి ఆందోళన బాట పట్టనున్న ఈ రైతుసంఘాలు ముందుగా పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఎమ్మెల్యేలను కలిసి వారితో చర్చించి మద్దతును కూడగట్టనున్నాను. అంతేకాకుండా జాతీయ స్ధాయిలో భారతీయ జనతాపార్టీలోని కీలకమైన నేతలతో కూడా ఎత్తిపోతల పథకంపై చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏది ఏమైనా చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఒక పక్క రైతు రుణమాఫీ చేసి అన్నదాతలను మనసును దోచుకుందని భావిస్తున్నప్పటికీ, మరోపక్క ఎత్తిపోతల పథకం మాత్రం అన్నదాతలకు ఆగ్రహం తెప్పిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: