ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత మర్రి చెన్నారెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్నట్టు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్లమెంటరీ సెక్రటరీల వ్యవస్థను పునరుద్ధరించడం ద్వారా చెన్నారెడ్డి అడుగుజాడల్లో కేసీఆర్ పయనిస్తున్నారని వారు అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1978లోనే పార్లమెంటరీ సెక్రటరీల వ్యవస్థను చెన్నారెడ్డి అమలు చేశారు. మంత్రి పదవులను ఆశిస్తున్న వారిని సంతృప్తి పరిచేందుకు ఆయన ఈ వ్యవస్థను అనుసరించారు. చెన్నారెడ్డి కేబినెట్లో పార్లమెంటరీ సెక్రటరీ పదవులను ఐదుగురు అనుభవించారు. ఇప్పడు కేసీఆర్ కూడా అదే చేస్తున్నారు. చట్ట ప్రకారం తెలంగాణలో 18కి మించి మంత్రులు ఉండరాదు. దీంతో, ఇతరులను తృప్తి పరిచేందుకు కొత్త పదవులను కేసీఆర్ సృష్టిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కు మంత్రి పదవి ఇస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావుకు కేబినెట్ విస్తరణలో స్థానం దక్కనుంది. దీంతో ఆ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ఏకైక ఎమ్మెల్యే జలగం వెంకటరావుకు ఏదో ఒక పదవి కట్టబెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో, శ్రీనివాస్ గౌడ్, జలగంలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించాలని కేసీఆర్ నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: