ఈ లెక్కలు చూసి.. ఇదేదో.. ఆంధ్రా కొత్త రాజధానికి సంబంధించిన న్యూస్ అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే.. ఇది కొత్త రాజధాని వార్త కాదు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ భవిష్యత్ చిత్రం.. ఓవైపు కొత్త రాజధాని అలా నిర్మిస్తాం.. ఇలా నిర్మిస్తామని.. చంద్రబాబు సర్కారు రోజుకో ప్రకటన చేస్తుంటే.. మేమేం తక్కువ తిన్నామని కేసీఆర్ ప్రభుత్వం కూడా అలా చేస్తాం..ఇలా చేస్తామని ప్రకటనలు గుప్పిస్తోంది. ఇప్పటికే.. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తామని.. నగరం నుంచి శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుకు ఆకాశ మార్గాలు వేస్తామని.. ప్రకటించింది.                                            ఐతే.. ఇది ప్రకటన కాదు.. హైదరాబాద్ నగరాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై ఓ సంస్థ తెలంగాణ సర్కారుకు సమర్పించిన దార్శనిక పత్రం.. హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రణాళికలను సాకారం చేసేందుకు లీ అసోసియేట్స్ అనే కన్సల్టెన్సీ ఇచ్చిన నివేదిక. దీని ప్రకారం.. రాబోయే పాతికేళ్లలో హైదరాబాద్ అభివృద్ధి కోసం అక్షరాలా లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. వచ్చే పాతికేళ్ల జనాభా అవసరాలు, విస్తరణను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ప్రణాళిక ఇది.                             మరో ఆరేళ్లలో .. హైదరాబాద్ మహానగరంలో 50 ఫ్లై ఓవర్లు నిర్మించాలని లీ అసోసియేట్స్ సూచించింది. దీనికితోడు 24 ఓవర్ , అండర్ బ్రిడ్జిలు నిర్మించాలని తెలిపింది. పెరగనున్న రైల్వే వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని ఈ సూచన చేసింది. నగరంతో పెనవేసుకుపోయిన మూసీ నదిపై దాదాపు 12 చోట్ల వంతెనలు నిర్మించాని సూచించింది. మరి వీటన్నింటినీ పూర్తి చేయడానికి పెద్ద ఎత్తున నిధులు అవసరం. అందుకే.. వీటిలో ప్రాధాన్యతలను బట్టి ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వెళ్లాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: