తీవ్ర విద్యుత్ కొరతతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణలో కొత్త కాంతులు నింపేందుకు జెన్ కో సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం రూ.39 వేల కోట్లను ఖర్చు చేయడం ద్వారా రాష్ట్రంలో విద్యుత్ కోతలకు చెక్ పెట్టడమే కాక నిరంతర విద్యుత్ ను కూడా సరఫరా చేసే అవకాశాలున్నాయని సర్కారుకు సవివర ప్రతిపాదనలను అందజేసింది. భారీ వ్యయంతో నిర్మించతలపెట్టిన విద్యుదుత్పత్తి కేంద్రాలకు నిధుల కొరతేమీ అడ్డురాకున్నా భూసేకరణ ప్రధాన అవరోధంగా మారుతోందని, దీనిని అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని కూడా సర్కారు పెద్దలకు సూచించింది. బొగ్గు కొతర వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండానే నెట్టుకురావచ్చని, ఇందుకోసం మొత్తం విదేశీ బొగ్గుతో ఆయా థర్మల్ విద్యుత్ కేంద్రాలను నడిపే అవకాశాలున్నాయని తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా మణుగూరు, కొత్తగూడెం ప్రాజెక్టులతో పాటు కాకతీయ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం మూడో దశ, రామగుండం, సత్తుపల్లి ప్రాజెక్టులను జెన్ కో తన నివేదికలో పేర్కొంది. వీటిలోనూ రూ.7,020 కోట్లతో పూర్తయ్యే మణుగూరు విద్యుదుత్పత్తి కేంద్రం, రూ.5,200 కోట్ల వ్యయంతో నిర్మితమయ్యే కొత్తగూడెం ప్రాజెక్టులపై దృష్టి సారించినా త్వరలోనే విద్యుత్ ఇక్కట్ల నుంచి బయటపడే అవకాశాలున్నాయని ప్రతిపాదించింది. తమ ప్రతిపాదనలకు సర్కారు నుంచి అనుమతి రావడమే ఆలస్యమని జెన్ కో అధికారులు చెబుతున్నారు. మరి సర్కారు ఏ మేరకు స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: