శ్రీమిత్రా, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హుధూద్ తుపాను బాధితుల సహాయార్థం ఇక్కడి ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిర్వహించిన స్టార్ క్రికెట్ కప్‌ను శ్రీకాంత్ ఎలెవెన్ జట్టు కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తరుణ్ జట్టు శ్రీకాంత్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించగా నిర్ణీత 19.2 ఓవర్లలో 199 పరుగులకు అలౌటైంది. 200 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన తరుణ్ ఎలెవెన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులకు అలౌటైంది. దీంతో 39 పరుగుల తేడాతో శ్రీకాంత్ జట్టు విజయం సాధించింది. తొలుత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని టాస్ వేసి మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, డిఎస్‌డిఓ పి రామకృష్ణ, సినీ ప్రముఖులు, హీరోహీరోయిన్లు, శ్రీ మిత్రా అధినేత చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఉదయం నుండి మ్యాచ్ అద్యంతం ప్రేక్షకులు స్టేడియంలో సందడి చేస్తూ తిలకించారు. హీరోయిన్లు హంసా నందిని, శాన్వీ, అర్చన, కామ్నా జఠ్మలానీ, సంజన డ్యాన్స్‌లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అనంతరం ఇరు జట్ల కెప్టెన్లకు శ్రీమిత్రా అధినేత చౌదరి స్టార్ క్రికెట్ కప్‌ను అందజేసి, విశాఖ బాధితులు గెలిచారంటూ ప్రకటించారు. వివిధ సంస్థల ద్వారా సమకూరిన నిధులను సిఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. మ్యాచ్ అద్యంతం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ రన్నింగ్ కామెంట్రీ చేస్తూ సినీ తారలతో కలిసి సందడి చేశారు. సాయంత్రం ముగింపు కార్యక్రమంలో హీరో జగపతిబాబు పాల్గొని ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, సినీ ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: