టిఆర్‌ఎస్‌లో ఇంటిపోరు రచ్చకెక్కింది. తనయునిపై ప్రేమ కెసిఆర్‌కు తలనొప్పిగా మారింది. ఇంటిపోరుకు తలొగ్గిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు బయటపోరు తప్పట్లేదు. జూన్‌ 2న ప్రమాణ స్వీకారం చేసిన కెసిఆర్‌ మంత్రి వర్గంలో కరీంనగర్‌ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు చోటు దక్కలేదు. అప్పట్లో ఈశ్వర్‌ స్థానంలో చివరి నిమిషంలో కెసిఆర్‌ తనయుడు కెటిఆర్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారనే చర్చ నడిచింది. అప్పటి నుంచీ ఈశ్వర్‌ గుంభనంగానే ఉంటున్నారు. ఆరు మాసాల అనంతరమైౖనా సర్దుబాటు చేసుకునే ప్రయత్నం పొసగలేదు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కెసిఆర్‌కు అత్యంత సన్నిహితులు, ఉద్యమ సమయంలో ఆయన వెన్నంటి నడిచిన వారికి మంత్రి పదవులు, కీలక స్థానాలు దక్కాయి. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతోన్న దశలో ఆయన వివిధ రాజకీయ పార్టీల్లో కొనసాగుతోన్న కుటుంబ పాలనపై విమర్శనాస్రాలు సంధించారు. తనకు కుటుంబం ముఖ్యం కాదు, పార్టీ, ప్రజలు ముఖ్యమంటూ పదేపదే నొక్కి చెప్పారు. '' నా కుమారుడు, కూతురు విదేశాల్లోనే ఉన్నారు. ఇక్కడ మియా, బీవీ (భార్యాభర్తలం) మాత్రమే ఉన్నాం. కుటుంబ బాదరబందీలు లేవు. తెలంగాణ తేవడమే ఏకైక లక్ష్యం'' అని కెసిఆర్‌ 2004లో జరిగిన ఎన్నికల సభల్లో పలుమార్లు వ్యాఖ్యానించారు. అనూ హ్యంగా 2009 ఎన్నికల నాటికి కుమారుడు, 2014 ఎన్నికల్లో కూతురు తెర పైకి వచ్చారు. దీంతో కుటుంబ రాజకీయాలకు తెరలేచింది. కెటిఆర్‌ మంత్రీ అయ్యారు. తర్వాత పరిణామాల దృష్ట్యా విస్తరణలో కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి ఖాయమని అంతా భావించారు. ఆరుమాసాలుగా మంత్రి వర్గం విస్తర ణకు నోచలేదు. తీరా విస్తరణ సమయానికి మంత్రి పదవికి బదులు చీఫ్‌విప్‌ పదవిని కట్టబెట్టారు. దీనిపై దళిత సంఘాల నిరసనలు జిల్లాలో వెల్లు వెత్తాయి. టిఆర్‌ఎస్‌ ప్రారంభం నుంచీ వెన్నంటి ఉన్న బలమైన నాయకునికి కొడుకు తెచ్చిన కొట్లాట అన్యాయం జరిగిందన్న వాదన అన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. కేవలం దళితుడు కావడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని దళిత సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అందుకు బదులుగా కొప్పుల ఈశ్వర్‌ కూడా స్పందించారు. ఈ నిరసనల నేపథ్యంలో తాను చీఫ్‌విప్‌ బాధ్యతలు స్వీకరించేది లేనని సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. అయినప్పటికీ ఆయనకు మంత్రి పదవి ఇచ్చేదాకా నిరసనలు తప్పవని దళిత సంఘాలు హెచ్చరిస్తున్నాయి. వాస్తవానికి జిల్లాలో టిఆర్‌ఎస్‌కు ప్రారంభం నుంచి వెన్నంటి ఉండటమే కాదు...ఈటెల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌ బలమైన నాయకులుగా నిలిచారు. వరుసగా మూడుసార్లు సార్వత్రిక, రెండుసార్లు ఉప ఎన్నికల్లో కొప్పుల గెలుపొందారు. ముందుగా కొప్పుల ఈశ్వర్‌ మేడారం నుంచి గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ధర్మపురికి మారినప్పటికీ ఆ ప్రభావం ఆయన విజయానికి ఆటంకం కాలేదు. గత ఎన్నికల సభలో పాల్గొన్న సందర్భంగా స్వయానా కెసిఆర్‌ అక్కడి ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈసారి గెలిపిస్తే ఆయన ఉన్నత పదవిలో ఉంటారని చెప్పారు. దీంతో ఉప ముఖ్యమంత్రి పదవి ఆయనకేనని పలువురు భావించారు. అయినా మంత్రివర్గంలో చోటు దక్కలేదు. అనంతరం స్పీకర్‌ పదవికి అవకాశం కల్పించినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రి పదవి కావాలనే ఉద్దేశ్యంతోనే ఆ పదవిని కాదనుకున్నారు. విస్తరణలోనైనా దక్కుతుందని భావించినప్పటికీ మొండిచేయే ఎదురైంది. దీంతో ఆయన తీవ్ర మనస్తా పానికి లోనయ్యారు. ఆయనతోపాటు జిల్లాలోని దళితులకు ఆ మనస్తాపం తప్పలేదు. అందువల్లే జిల్లాలో నిరసనధ్వనులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారనే విషయంపై పలువురు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తనయుడిని తప్పిస్తారా..? ఆయన ఉండగానే కొప్పులకూ సైతం మంత్రి పదవి ఇస్తారా..?వేచి చూడాల్సిందే. లేనిపక్షంలో దళితుల ఆగ్రహానికి గురికాక తప్పని పరిస్థితి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: