ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా చాలా మందికి పెన్షన్ కోత పెట్టింది. వృద్ధాప్య పెన్షన్ , వికలాంగ పెన్షన్ ను పెంచినట్టుగానే పెంచి చాలా మందిని ఆ జాబితా నుంచి తొలగించింది. అలాంటి వారిలో చాలా మంది అర్హులు కూడా ఉన్నారనే విషయం తెలిసిందే. అయితే ఏపీ ప్రభుత్వం చాలా చాకచక్యంగా ముందుకు వెళ్లింది. పెన్షనర్ల జాబితాలో కోతను పెట్టడం అనే పనినిచాలా నేర్పుగా ముగించింది. అయితే తెలంగాణ ప్రభుత్వంలో మాత్రం ఇలాంటి నైపుణ్యం కనపడటం లేదు. తెలంగాణ పరిధిలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు పెన్షనర్ల జాబితా పెద్ద తలనొప్పిగా మారింది. అనేక మంది వృద్ధులు ఈ విషయంలో ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. సహజంగానే ప్రభుత్వంపై టక్కున మండిపడే స్వభావం ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలు ఇప్పుడు ఈ విషయంలో కూడా ఫైర్ అవుతున్నారు. మొన్నెప్పుడో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ కు వెళితే అక్కడ వృద్ధులు అంతా ఆమెను ఆడ్డుకొన్నారు. తమను పెన్షనర్ల జాబితా నుంచి తొలగించారని వారు ఆందోళనకు దిగారు. మరి ఎంపీ హోదాలో ఉన్న ముఖ్యమంత్రి తనయకు అలాంటి అనుభవం ఎదురవ్వడం అంటే మాటలు కాదు! ఈ సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని చెప్పడానికి డిప్యూటీ సీఎం కాన్వాయ్ ని వృద్ధులు అడ్డగించిన విషయాన్ని కూడా ప్రస్తావించుకోవచ్చు. వరంగల్ లో రాజయ్యను కొంతమంది వృద్ధులు అడ్డుకొన్నారు. తమ పేర్లను పెన్షనర్ల జాబితా నుంచితొలగించారని వారు ఆందోళన వ్యక్తం చేశారు! మరి ఈ పరిస్థితిని చూస్తుంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చాలా త్వరగానే ప్రజావ్యతిరేకతను తెచ్చుకొంటోందనిపిస్తోంది!

మరింత సమాచారం తెలుసుకోండి: