ప్రజలను మభ్యపెడుతూ నిలువునా మోసం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. బాబు మాటలు నమ్మి ఓటేసిన రైతులను, డ్వాక్రా మహిళలను నిలువునా ముంచారని ఆరోపించారు. ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు నైజంగా మారిందన్నారు. నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, సర్వేపల్లి, నెల్లూరు సిటీ, రూరల్, సూళ్లూరుపేట, గూడూరు ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్‌కుమార్‌తో కలసి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు అబద్ధపు హామీలిచ్చి అధికారం చేపట్టారన్నారు. ఇప్పుడేమో మాయ మాటలు చెబుతూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. రైతులకు రుణాలు మాఫీ చేయలేమని తెలిసి కూడా అధికారం కోసం అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. జిల్లాలో ఎక్కువగా చేనేత కార్మికులు ఉన్నారని, ప్రభుత్వం వారి గోడు పట్టించుకోవడం లేదన్నారు. రైతు, డ్వాక్రా రుణాలన్నింటినీ వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సరిగ్గా అమలు చేయలేదన్నారు. బాబు మొదటి సంతకానికి, ఆయన మాటలకుగానీ విలువలేదన్నారు. రుణామాఫీకి సంబంధించి రైతు రుణాలకు సంబంధించి వడ్డీని కూడా ప్రభుత్వమే భరించాలన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ రైతులను నిలువునా మోసం చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరే అని ఆరోపించారు. రుణమాఫీ మాట పక్కనుంచి రైతులను దొంగలుగా చిత్రీకరించి వారిని కూడా జైళ్లలో పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రైతులు తీసుకున్న ప్రతి పైసాను కూడా మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పి, ఇప్పుడేమో లేనిపోని మెలికలు పెడుతున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. చంద్రబాబు వంద జన్మలెత్తినా వైఎస్సార్ మాదిరిగా పాలన చేయలేరన్నారు. వైఎస్సార్‌సీపీ తరపున ప్రజల పక్షాన నిలబడి, వారికి జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రైతులకు ఫోన్ చేసి మరీ రుణాలు మాఫీ చేస్తానని డాబు మాటలు చెప్పిన బాబు నిలువునా మోసం చేశారని ఆరోపించారు. రుణమాఫీ పథకం కాస్త గోల్‌మాల్ పథకంగా మారిందన్నారు. కచ్చితంగా చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల ఉసురు తగులుతుందన్నారు. జిల్లాకు చెందిన మున్సిపల్ మంత్రి నెల్లూరుకు ఎప్పుడు వస్తారో..ఎప్పుడు వెళతారో.. ఆయనకే అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. ఎడ్లబండ్లతో ఇసుక తోలుకుని జీవనం సాగిస్తున్న పేదల వద్ద నుంచి అధికారులు పన్ను కట్టించుకుంటుంటే జిల్లాకు చెందిన మంత్రి ఒక్క మాటకూడా మాట్లాడకపోవడం దారుణమన్నారు. మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం రోజున నెల్లూరుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు 24 గంటల్లో నెల్లూరుకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులపై స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తక పోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించకపోతే ప్రజల తరపున వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు బెల్టు షాపులు ఎక్కడా లేకుండా చేస్తామని చెప్పిన నాయకులు ఇప్పుడు ఊరూరా బెల్టు షాపులు పెట్టించారన్నారు. ఈ ప్రభుత్వ తీరును చూసి మహిళలు ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఆందోళనతోనే ప్రభుత్వం భయపడి హడావుడిగా రుణమాఫీ ప్రకటన చేసిందన్నారు. ఆ ప్రకటనలో కూడా ఎక్కడా స్పష్టత లేదన్నారు. సూళ్లూరూపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ప్రజల పక్షాన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ఆందోళన కార్యక్రమాలతోనే ప్రభుత్వం భయపడుతుందన్నారు. ఇప్పటికైనా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు సీటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ రూప్‌కుమార్‌యాదవ్, బీసీ సెల్ అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్ పాల్గొన్నారు. చంద్రబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, నెల్లూరు, chandrababu, YSR congress party, Nellore

మరింత సమాచారం తెలుసుకోండి: