ఏపి ప్రభుత్వం అమలు చేశామంటున్న రుణమాఫీ వట్టి బూటకమని రైతులు, రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు ఆల్ ఫ్రీ అన్న చంద్రబాబు ఎన్నికల తర్వాత మాఫీల విషయంలో ఆంక్షలు పెడుతున్నారని విమర్శిస్తున్నారు. చివరికి ఎంతో కొంత బ్యాంకుల్లో జమ చేసి, చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. టీడీపీ సర్కారుపై రైతులు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కర్షకులను ఆదుకోవడమే లక్ష్యమంటూ తమను నమ్మించి గద్దెనెక్కిన బాబు ఇప్పుడు తమ కష్టాలను అసలు పట్టించుకోవడం లేదంటున్నారు. ఆంధ్రప్రదేశ్-లో మొత్తం రైతు రుణాలు 87 వేల కోట్లు ఉంటే వాటిని 30 వేల కోట్లకు తగ్గించి మాఫీ చేశామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అందులో కూడా యాబై వేల రూపాయలు ఉన్న రైతులకు పూర్తిగా మాఫీ అంటూ కేవలం ఒక్కో రైతు ఖాతాలో 10, 15, 18 వేలు మాత్రమే వేసి చేతులు దులుపుకున్నారని మండిపడుతున్నారు.  ఈ మాత్రం దానికి రుణమాఫీ అని చెప్పడం దేనికంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బ్యాంకుల్లో అధిక మొత్తం అప్పుండడంతో ఈ ఏడాది సాగు కోసం మళ్ళీ బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రైవేటు వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని అప్పులు ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. రుణమాఫీ కలగా మిగిలిందే తప్ప ఏ ఒక్క రైతుకూ పూర్తిగా రుణం మాఫీ కాలేదని రైతుసంఘం నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని అన్నదాతలను అప్పుల ఊబి నుంచి బయటపడేయాలని రైతులు, రైతు సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: