చంద్రబాబుకు విజన్ ఉన్న నాయకుడుగా మంచి పేరుంది. మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడే ఆయన విజన్ 2020 అంటూ ప్రచారంతో హోరెత్తించారు. ఐతే.. ఆ ముందు చూపు రాజధాని ఎంపిక విషయంలో కొరవడిందంటున్నారు కొందరు నిపుణులు.. రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మించేటప్పుడు అన్ని కోణాల్లో ఆలోచించకుండా.. కేవలం వాస్తు.. నీటి లభ్యత, కనెక్టివిటీ ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజధానిగా ఎంపిక చేసిన ప్రాంతం వరదలు, భూకంపాలు, తుపానులను తట్టుకునే పరిస్థితి లేదని వివరిస్తున్నారు.                                                     ఆంధ్రా కొత్త రాజధాని ప్రకృతి విపత్తుల నుంచి సురక్షితంగా బయటపడే అవకాశం లేదనే విషయాన్ని నిపుణులు గత అనుభవాలను ఉదహరిస్తూ వివరిస్తున్నారు. భూగర్భ పరిశోధక శాఖ 2009-10, 2010-11 సంవత్సరపు నివేదికలను వారు ఆధారాలుగా చూపిస్తున్నారు. భారతీయ జియోలాజికల్ సర్వే ప్రకారం విజయవాడ, పరిసర ప్రాంతాలు భూకంపాల ప్రాంతం. ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించడం లేదు. కృష్ణా నదిపై ఇప్పటికే ఆరు వంతెనలున్నాయి. మరో ఆరు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అదే జరిగితే 1978లో ఢిల్లీ వరదల అనుభవం పునరావృతమైనా ఆశ్చర్యం లేదు.                         కృష్ణా నదిపై ఉన్న చివరి డ్యాం నాగార్జున సాగర్ అయితే చివరి ఆనకట్ట ప్రకాశం బ్యారేజీ. 1990నాటి విపత్తుల నివారణ సంస్థ నివేదిక ప్రకారం కృష్ణా బేసిన్‌లో వరద ప్రమాదం ఎక్కువుండే ప్రాంతం కూడా ఇదే. సాగర్ డ్యాం నుంచి భారీ వరద వచ్చి కృష్ణాబ్యారేజీకి జరగరానిదేదైనా జరిగితే గుంటూరు జిల్లాలో 13, కృష్ణా జిల్లాలో 16 మండలాలు ముంపునకు గురవుతాయి. గుంటూరు జిల్లాలో 103, కృష్ణా జిల్లాలో 63 గ్రామాలు తీవ్రంగా దెబ్బతింటాయి. 2009లో కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాలను ముంచెత్తిన వరదలే ఇందుకు రుజువు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలు గుర్తించాలన్న ఈ వాదనతో ప్రభుత్వం ఏకీభవిస్తుందా..?

మరింత సమాచారం తెలుసుకోండి: