మా వల్లే తెలంగాణా వచ్చిందని, ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన ప్రాజెక్టులన్నీ తన ఘనతేనని చెప్పుకున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా విభజన బిల్లు అంశాలను అమలు చేయకుండా, ఇప్పుడు ఆ బిల్లుకు రాజ్యాంగ సవరణ అవసరమంటూ మాటమార్చడం దారుణమని పీసీసీి అధ్యక్షులు ఎన్‌.రఘువీరారెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజన బిల్లుకు సాక్ష్యంగా వున్న మీరు..నిజాయితీగా ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, మరో చంద్రబాబులా మారొద్దు అంటూ ఆయనకు హితవు చెప్పారు. ఆంధ్రరత్నభవన్‌లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెంకయ్య వివాదస్పద వ్యాఖ్యలపై రఘువీరారెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర విభజన బీజేపీ వల్లే జరిగిందని, వెంకయ్యనాయుడు ఫొటోలతో సహా పుస్తకాలు ముద్రించి, ఊరూరా ఊదరగొట్టి ఆరు నెలల తర్వాత మాట మార్చడం రాష్ట్రానికి తీరని ద్రోహం చేయడమేనన్నారు.  రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నూతన రాజధాని నిర్మాణానికి నిధులు, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు, 14 రకాల కేంద్ర సంస్థల ఏర్పాటు, తీరప్రాంతంలో ఓడ రేవుల నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, విజయవాడ,తిరుపతి, విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి వంటి అనేక అంశాలు విభజన బిల్లులో వెంకయ్య సాక్షిగా ఆమోదించబడ్డాయన్నారు. ఇవన్నీ తన వల్లే వచ్చినట్లు కూడా ఆయన ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసుకున్నారని, ఇప్పుడు దీనిని కొత్త మలుపు తిప్పే యత్నం చేయడం మోసపూరిత చర్యగా పేర్కొన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నందున విభజన బిల్లు అంశాలను అమలుపర్చాల్సిన బాధ్యత ఈ రెండు పార్టీలపైనే ఉందన్నారు.    రాష్ట్రంలో చంద్రబాబు అమలు చేశానని చెప్పుకుంటున్న రైతు రుణమాఫీ అస్తవ్యస్తంగా ఉందని రఘువీరా విమర్శించారు. ఎన్నికల ముందు రుణాలన్నీ రద్దు చేస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు అనేక నిబంధనలతో కోత విధించడం సరికాదన్నారు. ప్రస్తుతం రూ.50వేల లోపు రద్దు చేశామని చెపుతున్న రుణాల జాబితాపై గందరగోళం నెలకొందన్నారు. రుణ జాబితాపై అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన టోల్‌ఫ్రీ నెంబర్లు రెండూ గత మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నా పనిచేయడం లేదన్నారు. దీనిపై అనేకమంది రైతులు తమ ఫిర్యాదులు చేస్తున్నారని, అయితే వీరందరూ వ్యవసాయశాఖా మంత్రి సెల్‌నెంబరు 97012 74747కు చేయాలని ఆయన సలహా ఇచ్చారు. ఇకనైనా చంద్రబాబు ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలని, మాట మీద నిలబడాలని, లేకుంటే అమలు చేసే వరకు కాంగ్రెస్‌ పోరాడుతుందని రఘువీరా స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: