రాష్ట్రంలో నెలకొల్పనున్న నాలుగు మెగా ఐటి హబ్‌లతో భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, అనంతపురంలో మెగా ఐటి హబ్‌లు అభివృద్ధి చేస్తామన్నారు. నరసాపురంలో సోమవారం బాపు జయంతి ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రానున్న అయిదేళ్లలో ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాలలో రూ.45 వేల కోట్లు వ్యాపారాభివృద్ధి సాధించాలని సంకల్పించామన్నారు. దీనివలన ఐటి రంగంలో 5 లక్షలు, ఎలక్రానిక్స్ రంగంలో 4 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.  పరిశ్రమల ఏర్పాటుచేసే ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 50 శాతం, ఇతరులకు 25 శాతం రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పోలవరం ప్రాజక్టు నిర్మాణ అడ్డంకులు త్వరలోనే తొలగించి, నిర్మాణం పూర్తిచేస్తామని మంత్రి పల్లె పేర్కొన్నారు. మహామహులైన అల్లూరి సీతారామరాజు, గిడుగు రామ్మూర్తి, ప్రకాశం పంతులు, బాపు వంటి ఉద్దండుల జయంతులను ఇక నుండి రాష్ట్ర ఉత్సవాలుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. బాపు జయంత్యోత్సవాల్లో భాగంగా నిర్వహించిన 2కె నడకలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు.  గోదావరి ఒడ్డున నెలకొల్పిన బాపు కాంస్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, శాసన సభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, ప.గో. జిల్లా పరిషత్ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, రాజ్యసభ సభ్యులు తోట సీతారామలక్ష్మి, గరికపాటి రామ్మోహన్, ఏలూరు ఎంపి మాగంటి వెంకటేశ్వరరావు, ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్, నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, పలువురు శాసన సభ్యులు, అధికార్లు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: