అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒకే రోజు భారీ స్థాయిలో నష్టపోయి పదిన్నర మాసాల కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. ప్రపంచ మార్కెట్లో రూపాయి విలువను మకుటంల చేసేలా చర్యలు తీసుకుంటామని ఎన్నికలకు ముందు మోడీ చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా భారత కరెన్సీ విలువ దిగజారుతోంది. సోమవారం ఒకే రోజు ప్రపంచ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 0.64 పైసలు లేదా 1.03 శాతం దిగజారి 62.94 వద్ద ముగిసింది. ఓ దశలో గరిష్టంగా 62.95 వద్ద నమోదయ్యింది. జనవరి 28న రూపాయి విలువ ఈ స్థాయిలో నమోదయ్యింది. ఆగస్టు 6న రూపాయి విలువ 1.05 శాతం తగ్గింది. తర్వాత కాలంలో తాజాగా రూపాయి ఈ స్ఠాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. వరుసగా తగ్గుతోన్న రూపాయి మారకం విలువను కట్టడి చేయడానికి ఆర్‌బిఐ రూ.62.70కే డాలర్లను విక్రయించినప్పటికీ, రూపాయి పతనాన్ని నివారించలేకపోయింది. భవిష్యత్తులో రూపాయి విలువ మరింత తగ్గే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు వరుసగా పడిపోవడానికి తోడు డాలర్‌కు డిమాండ్‌ పెరగడం రూపాయి విలువ తగ్గడానికి ఓ కారణంగా ఉంది. ఈ ఏడాది అక్టోబర్‌ మాసంలో దేశ పారిశ్రామికోత్పత్తి సూచీ మూడేళ్ల కనిష్ట స్థాయికి దిగజారడం రూపాయిపై ఒత్తిడి పెంచుతుందని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మాసంలో ఐఐపి -4.2 శాతం ప్రతికూల వృద్ధిని చవి చూసిన విషయం తెలిసిందే. మరోవైపు గత వారంలో స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురి అయిన విషయం తెలిసిందే. సెన్సెక్స్‌ 1000 పైగా పాయింట్లు కోల్పోయింది. ఈ ప్రభావం రూపాయిపై ప్రధానంగా ఉంది. దేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు రోజు రోజుకు రూపాయికి ఉరితాడుగా మారుతోన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన రోజుల్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ సమానంగా పలికింది. 1991 ఆర్థిక సంస్కరణల సమయంలోనూ డాలర్‌తో రూపాయి విలువ రూ.17గా ఉంది. తర్వాత రెండేళ్లలోనే అంటే 1993లో ఏకంగా రూ.31.50కు దిగజారింది. 2000 నుంచి 2010 కాలంలో రూ.40-50 మధ్య నమోదయ్యింది. 2008 నుంచి వరుసగా తగ్గుతూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: