మంత్రివర్గమంటే.. ప్రభుత్వానికి సంక్షిప్తరూపం లాంటింది. మంత్రివర్గం తీసుకునే కీలక నిర్ణయాలే ప్రభుత్వాన్ని నడిపిస్తాయి. విధాన నిర్ణయాల్లో, అమల్లోనూ దీనికే కీలకపాత్ర.. అలాంటి మంత్రి వర్గంలో అన్నివర్గాలకూ సమప్రాధాన్యం లభించేలా చూడటం కష్టమే.. కానీ సాధ్యమైనంతగా అన్ని వర్గాలనూ కలుపుకుపోతూ.. మంత్రివర్గాన్ని కూర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.                                                          ముఖ్యంగా కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు అవకాశమే దక్కలేదు. జనాభాలో సగం ఉన్న మహిళల నుంచి కనీసం ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకపోవడం ఎక్కువగా విమర్శలపాలవుతోంది. దేశం మొత్తం మీద.. ఇలా మంత్రివర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వని ఒకే ఒక్క సీఎం కేసీఆర్ కావడం విశేషం. ఇదే అదనుగా కేసీఆర్ మంత్రవర్గంలో సమతుల్యత లోపించిందని విపక్షాలు విమర్శల జోరు పెంచాయి. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని పక్కకు పెట్టి.. ఉద్యమంలో ఏమాత్రం పాల్గొనని తుమ్మల, తలసాని వంటి వారికి పెద్దపీట వేశారన్న విమర్శలూ వస్తున్నాయి.                               తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుండా, టిడిపి ఉన్నప్పుడు ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించినవారికి మంత్రి పదవులు ఎలా ఇచ్చారని తెలంగాణ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇది తెలంగాణ అమరవీరులను అవమానించినట్లు కాదా అని వారు ప్రశ్నించారు. సామాజిక ఉద్యమకారుడు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మంద కృష్ణ మాదిగా మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత దొరల పాలన వచ్చినట్లు కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అత్యధిక శాతం బలహీనవర్గాలు ఉంటే వారికి ప్రాధాన్యం ఇవ్వకుండా తక్కువ శాతం ఉన్న అగ్రవర్ణాలకు మంత్రి పదవులు కట్టబెట్టారని కృష్ణ విమర్శించారు. అన్నివర్గాలనూ సంతృప్తిపరచడం అసాధ్యమే అయినా మహిళలకు స్థానం ఇవ్వకపోవడం మాత్రం దారుణమే.

మరింత సమాచారం తెలుసుకోండి: