ఇప్పటకే 37 మంది సాక్షులను విచారించారట పోలీసులు. కాంగ్రెస్ యువనేతల గొడవకు సంబంధించి విచారణను మొదలు పెట్టిన పోలీసులు ఇప్పటికే దాన్ని పూర్తి చేశారట. ఈ మేరకు విష్ణుకు నోటీసులు కూడా అందినట్టుగా తెలుస్తోంది. ఇటువంటి నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డి వెళ్లి పీసీసీ చీఫ్ పొన్నాలను కలవడం ఆసక్తికరంగా మారింది. అసలుకు మొదట్లోనే కాంగ్రెస్ పెద్దలు వీరిద్దరి మధ్య రాజీ కి ప్రయత్నించారట. పార్టీ పరువు పోతుంది.. అని సర్ధి చెప్పబోయారట. అయితే ఈ ఇద్దరు నేతలూ దానికి ఒప్పుకోలేదు. ఇది తమ వ్యక్తిగత గొడవ అని... దీన్ని తామే వ్యక్తిగతంగా తేల్చుకొంటామని విష్ణు, వంశీలు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు విష్ణు స్వయంగా వెళ్లి పొన్నాలను కలిశాడు. ఇలాంటి గొడవలు మామూలేననట్టుగా మాట్లాడాడు. తామంత కాంగ్రెస్ కుటుంబ సభ్యులం అని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చాడు! ఈ విధంగా ఆయన మాట్లాడటం విశేషమేనని చెప్పవచ్చు. మొదట పోలీస్ స్టేషన్ కు వెళ్లింది కూడా విష్ణునే. ఈ గొడవ గురించి రకరకాల వెర్షన్లు చెప్పింది కూడా ఆయనే! ఇప్పుడు.. మళ్లీ అంతా ఒక కుటుంబ సభ్యులం అని అంటున్నది కూడా ఆయనే! మరోవైపు ఆయనే కొట్టి.. ఆయనే కుటుంబ సభ్యులం అని అంటున్నాడని వంశీ అభిమానులు అంటున్నారు. అకారణంగా దాడికి పాల్పడిన విష్ణు ఈ విధంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. పోలీసు విచారణలో అసలు నిజాలు తెలుస్తాయని.. అప్పుడు విష్ణుపై చర్యలుతప్పవని వారు అంటున్నారు. ఈ విషయాన్ని గ్రహించే విష్ణు రాజీ ఫార్ములాతో ముందుకు వస్తున్నాడని వారు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ గొడవ ఇంకా ఎలాంటి టర్న్ తీసుకొంటుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: