రాజధాని ప్రాంత అభివృద్ధి అధారిటీ బిల్లును శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. గత భేటీలో ఆమోదించిన ముసాయిదా బిల్లులో నాలుగు సవరణలు చేస్తూ కొత్తగా ఆమోదం తెలిపారు. కేబినెట్ సమావేశం బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నాలుగు గంటలపాటు జరిగింది. రాజధాని అధారిటీ బిల్లుపై విస్తృతంగా చర్చించిన అనంతరం నాలుగు సవరణలు ఆమోదించారు. బిల్లులోని అంశాలను సరళీకృతం చేయాలని ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు చేసిన సూచనలపై చర్చించిన మంత్రివర్గం చివరకు నాలుగు అంశాల్లో సవరణలకు ఆమోదం తెలిపింది. రాజధాని అథారిటీలో 15మంది సభ్యులుంటారు. అథారిటీకి చైర్మన్‌గా సిఎం, వైస్‌చైర్మన్‌గా మున్సిపల్ మంత్రి, కన్వీనర్‌గా మున్సిపల్ శాఖ కమిషనర్ ఉంటారు. మొదటి విడతగా అథారిటీకి వెయ్యి కోట్లు మూలధనాన్ని కేటాయిస్తారు. 250 కోట్లు రాజధాని అభివృద్ధి నిధులకింద కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. బిల్లు ప్రతిని గురువారం స్పీకర్‌కు అందించనున్నారు. అనంతరం శుక్రవారం సభలో చర్చించి ఆమోదం పొందాలని నిర్ణయంచారు. ఎర్రచందనం స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఎర్రచందనం ద్వారా ఏటా రెండు నుంచి మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేలా చూడాలని తీర్మానించారు. అక్రమార్కుల ఆస్తుల జప్తు ద్వారా కొంత ఆదాయం, కలప అమ్మకం ద్వారా మరికొంత ఆదాయం సమకూర్చుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలపై కూడా విస్తృత చర్చ జరిగింది. గతంలో ఉన్న నిబంధనలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. సభ్యుల సంఖ్యను యదాతధంగానే ఉంచాలని, వారి పదవీ కాలాన్ని ఏడాదిగా నిర్ణయించాలని తీర్మానించారు. అంతేకాకుండా సభ్యులను నామినేషన్ విధానం ద్వారా నియమించాలని, సవరణలను హైకోర్టుకు సమర్పించి నియామకాలకు అనుమతి కోరాలని నిర్ణయించారు. కాగా, వ్యవసాయశాఖపై జరిగిన చర్చలో రైతు తాము పండించిన ధాన్యాన్ని రాష్ట్రంలో ఎక్కడైనా అమ్ముకునేలా అవకాశాన్ని కల్పించాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. ఎక్కడ ధర ఎక్కువ ఉంటే అక్కడ అమ్ముకోవడం ద్వారా రైతుకు లబ్ది అందేలా చూడాలని నిర్ణయించారు. అలాగే రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని తీర్మానించారు. అందుకు అవసరమైన ఆర్ధిక భారాన్ని కూడా ప్రభుత్వం భరించాలని నిర్ణయించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు బజార్లకు పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించారు. కాగా, ఎయిడెడ్ ఉపాధ్యాయులు, కళాశాల అధ్యాపకులకు పదవీ విరమణ వయసును పెంచుతూ మంత్రివర్గం ఆమోదించింది. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు 58 నుంచి 60 సంవత్సరాలకు, అధ్యాపకులకు 60 నుంచి 62 సంవత్సరాలకు పరిమితి పెంచాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మంది పంచాయితీ కార్యదర్శుల నియామకానికి కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. మరో నాలుగు వేల మంది జాతీయ ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకులను నియమించేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. చిత్రం... మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: