దేశంలో విపక్షాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఈ పరిస్థితుల్లో భారతీయ జనతాపార్టీ ని వ్యతిరేకిస్తున్న అన్ని విపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చే యత్నాలు ప్రారంభం కావడం ఆహ్వానించదగిన పరిణామమే. అయితే దీనివల్ల భాజపాకు ఇప్పుడే ముంచుకొచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఎందుకంటే విపక్షాల కలయికపై యత్నాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. మరి వాటిమధ్య ఉన్న విభేదాల మాటేంటి? ఇవి ఒక కొలిక్కి రాకుండా అవి ఏకమవడం సాధ్యమయ్యే పనికాదు. అదే ఇప్పుడు భాజపాకు లాభిస్తున్న అంశం.నేటి భారత రాజకీయాల్లో భాజపా ఆధిపత్యమే కొనసాగుతోంది. దీన్ని చూస్తుంటే ఒకప్పుడు దేశ రాజకీయాలను కాంగ్రెస్ శాసించిన సమయంలో ఏం జరిగిందనేది గుర్తుకొస్తోంది. స్వంతంగా అయితేనేమి లేక మిత్రపక్షాలతో కూటమి కట్టి అయితేనేమి..1947 నుంచి 2014 వరకు కాంగ్రెస్ కేవలం 12 సంవత్సరాలు మాత్రమే అధికారంలో లేదు. మరి ఈ నాలుగున్నర దశాబ్దాల కాలంలో దేశ ప్రధానిగా లేదా తెరవెనుక అధికారం చెలాయించింది కేవలం నెహ్రూ గాంధీ కుటుంబ సభ్యులే. అయితే లాల్‌బహదూర్ శాస్ర్తీ, పివి నరసింహారావుల హయాంలలో నెహ్రూ కుటుంబ సభ్యుల హవా కొనసాగలేదు. కానీ తెరవెనుక బాధ్యతలు లేని సర్వాధికారాలు చెలాయించిన ఘనత మాత్రం సోనియాగాంధీ కే దక్కుతుంది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ నుంచి విముక్తి పొందిన భారత్ మాత్రమే తన లక్ష్యమని ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో 1967, 1977, 1996 సంవత్సరాల్లో ఏం జరిగిందో ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం. 1967లో నాలుగో సాధారణ ఎన్నికల తర్వాత ఉత్తర భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో రైట్, లెఫ్ట్ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. కోల్‌కతా నుంచి అమృత్‌సర్ వరకు ప్రయాణించినప్పుడు ఈ మార్గంలోని ఒక్క రాష్ట్రంలో కూడ కాంగ్రెస్ అధికారంలో లేకపోవడం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అదే మొట్టమొదటిసారి. అత్యయిక స్థితి తర్వాత 1977లో, మళ్లీ 1989లో జయప్రకాశ్ నారాయణ్, విపి సింగ్‌ల నాయకత్వాల్లో కాంగ్రెస్సేతర రాజకీయ శక్తులు ఒకే తాటిపైకి వచ్చాయి. వీటి మధ్య తీవ్ర స్థాయి సైద్ధాంతిక విభేదాలున్నప్పటికీ, వీరందరిని ఒక్కదగ్గరకు చేర్చింది కేవలం కాంగ్రెస్ వ్యతిరేక భావన మాత్రమే. ఇదే కథ 1996లో కూడ పునరావృతమైనప్పటికీ, నాటి ప్రధానులుగా వ్యవహరించిన హెచ్‌డి దేవెగౌడ, ఇందర్‌కుమార్ గుజ్రాల్‌లు విపక్షాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రభుత్వాలను ఏర్పాటు చేసినా, వారిద్దరూ ప్రజాకర్షణ కలిగిన నాయకులు కాకపోవడం పెద్ద లోటుగా మారింది. మరి నేటి పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. 2009 నుంచి 2014 మధ్య కాలంలో భాజపా ఓట్ల శాతం 18.8 శాతం నుంచి 31శాతానికి పెరిగిపోయింది. ఇదే కాలంలో కాంగ్రెస్ ఓట్ల శాతం 28.55 శాతం నుంచి 19.31శాతానికి దిగజారింది. వెస్ట్‌మినిస్టర్ తరహా పార్లమెంటరీ వ్యవస్థలో ఎంతమంది పోటీలో ఉన్నా కేవలం ఒక్క వ్యక్తికే ఓటు వేసే విధానం అమల్లో ఉండటం వల్ల, వివిధ పార్టీల ఓటములు లేదా గెలుపులు ఒకే రీతిలో అతిశయోక్తులుగానే కనిపించాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌కు లోక్‌సభలో కేవలం 44 మంది ఎంపిలు మాత్రమే ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంతటి దయనీయ స్థితికి కాంగ్రెస్ దిగజారడం ఇదే తొలిసారి. ఇక వామపక్షాలు 12, కొత్తగా ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీకి నలుగురు ఎంపిలు ఉన్నారు. మరి ఇక్కడి నుంచి ఏం జరుగుతుంది? 1970 మాదిరిగానే బీహార్‌లో భాజపా వ్యతిరేక శక్తులు ఒక్కటవుతున్నాయి. 2014 మే నెలలో జరిగిన సాధారణ ఎన్నికల ఫలితాలతో కనువిప్పు కలిగిన నితిష్ కుమార్ (జనతాదళ్-యు), లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్‌జెడి)లు తమ పూర్వ వైరాన్ని మరచి ఒక్కసారిగా స్నేహితులయ్యారు. కాంగ్రెస్‌కు ఈ రెండు పార్టీలతో జట్టు కట్టడం మినహా మరో మార్గం లేదు. భాజపా, రామ్‌విలాస్ పాశ్వాన్ నేతృత్వలోని లోక్ జనశక్తితో కూటమి కట్టింది. ఈ సరికొత్త రాజకీయ సమీకరణలు రానున్న కాలంలో ద్విముఖ పోటీలకు దారితీస్తాయి. బీహార్ అసెంబ్లీ పదవీకాలం 2015 నవంబర్‌తో ముగియనుంది. డిసెంబర్ తొలి నాళ్లలో జెడి(యు), ఆర్‌జెడి, జనతా పరివార్‌కు చెందిన మరో నాలుగు రాజకీయ పార్టీలు సన్నిహితమవుతున్నాయన్న వార్తలు వెలువడ్డాయి. ఇవి వరుసగా ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ, హెచ్‌డి దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (ఎస్), చౌతాలా కుటుంబం ఆధిపత్యంలోని భారత జాతీయ లోక్‌దళ్, మాజీ ప్రధాని చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన సమాజ్‌వాది జనతా పార్టీ. ఇందులో ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోను, దేవెగౌడ కర్ణాటకలోను, చౌతాల కుటుంబం హర్యానాలోను మూలాలు కలిగివున్నారు. మరో జనతా పరివార్‌కు చెందిన మాజీ పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్‌ను ఈ సరికొత్త కూటమిలోకి ఆహ్వానించడానికి మిగిలిన పార్టీలకు సుతరామూ ఇష్టం లేదు. వీటన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొని రావడానికి కృషి చేస్తున్న ములాయం సింగ్ యాదవ్‌కు ఉన్న ఒకే ఒక సౌలభ్యమేమంటే...ఈ సరికొత్త కలగూరగంపలోని పార్టీలు వేర్వేరు రాష్ట్రాల్లో బలాన్ని కలిగివుండటం. అంటే ఒకదాని ప్రాభవం మారో పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో లేకపోవడమే! ఇక భాజపా యేతర పార్టీలను ఒకే మార్గంలోకి తీసుకొని రావడంలో ఉన్న అతికష్టమైన అడ్డంకి ఏమంటే...వీరిలో ఒకరంటే మరొకరికి అసలు పడకపోవడం. సమాజ్‌వాదీ పార్టీ బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలు రెండూ ఒకే వేదికమీదికి రావడం దుస్సాధ్యం. గత ఆగస్టులో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో భాజపా యేతర పార్టీలకు సంఘీభావంగా బీఎస్పీ తన అభ్యర్థులను నిలబెట్టకపోయినంత మాత్రం చేత ఆ పార్టీ అధినేత్రి మాయావతి ఈ గ్రూపులోకి చేరుతుందని భావించడానికి వీల్లేదు. 2017 మార్చిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. మరి యుపి పీఠం కోసం పోరాటం సలిపే ఎస్‌పి, బీఎస్‌పీలు ఒకే వేదికపైకి రావడం సాధ్యం కానిది. యుపిలో ములాయం సింగ్ యాదవ్, మాయావతి మధ్య ఏవిధమైన వైరం ఉన్నదో అదే పరిస్థితి తమిళనాడులోని అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత, డిఎంకె అధినేత కరుణానిధుల మధ్య కొనసాగుతోంది. ఇక పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ పరిస్థితి ఇందుకు భిన్నం కాదు. అన్నింటికీ మించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని శారదా చిట్‌ఫండ్ కేసు వెన్నాడుతోంది. ఇక జయలలిత పన్ను చెల్లింపుల సమస్యలు ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. ఈ పరిస్థితుల్లో భాజపా ప్రభుత్వం పై ఇద్దరు మహిళా నేతలకు సెగను చల్లారనీయకుండా కొనసాగిస్తూ వారిపై వత్తిడిని కొనసాగిస్తూనే ఉంటుంది. అదేవిధంగా అక్రమ ఆస్తుల కేసులో మాయావతిపై కూడా భాజపా ప్రభుత్వం ఇదే వైఖరిని అవలంబించక మానదు. బిజూ జనతాదళ్‌కు చెందిన నవీన్ పట్నాయక్ ప్రస్తుతం జాతీయ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన ప్రభుత్వంపై రాష్ట్రంలో ఏవిధమైన వ్యతిరేకత లేదు. గత పదిహేనేళ్లుగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన మానాన తాను ప్రశాంతంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఈ పరిస్థితులన్నింటిని చూస్తుంటే ప్రస్తుతం భాజపా పరిస్థితికేం ఢోకాలేదన్న సంగతి వెల్లడవుతోంది. కాకపోతే పాలక భాజపా అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. ముఖ్యంగా పార్టీలోని ఉదారవాదులు, హార్డ్‌లైనర్ల మధ్య సమన్వయం సాధించడం నరేంద్ర మోదీకి తలకుమించిన భారంగా మారింది. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు ప్రధాని నరేంద్ర మోదీకి సవాలుగా పరిణమించనున్నాయి. భాజపాయేతర రాజకీయ పార్టీల కూటములు లేదా మరే ఇతర రాజకీయాల గురించి నరేంద్ర మోదీ ఏమాత్రం భయపడటం లేదు. ముస్లింలకు వ్యతిరేక ప్రకటనలు ఇస్తూ తనకు ఇబ్బందులు సృష్టిం వద్దని సంఘపరివార్‌లోని హార్డ్‌లైనర్ల ఒప్పించడంలోనే ఆయన తలమునకలు కావాల్సి వస్తోంది. ప్రస్తుతం తన ప్రభుత్వం అనుసరిస్తున్న అందరినీ కలుపుకుపోయే విధానానికి హార్డ్‌లైనర్లు పెద్ద అడ్డంకిగా మారారు. ప్రస్తుతం మోదీ ముందున్న ప్రధాన సమస్య హార్ట్‌లైనర్లను తన దారికి తెచ్చుకోవడం!

మరింత సమాచారం తెలుసుకోండి: