జనవరి ఒకటో తేదీని ప్రభుత్వ సెలవుదినంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. లలిత కళాతోరణంలో గురువారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులపై వరాలు జల్లు కురిపించారు. గతంలో క్రిస్మస్‌కు ఒక రోజు మాత్రమే సెలవు ఉండేదని, తమ ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇకపై జనవరి ఒకటిన కూడా సెలవుదినంగా పరిగణిస్తామని తెలిపారు. ఇప్పటివరకూ క్రైస్తవులకు సంక్షేమానికి ప్రత్యేక బోర్డు లేదని, దీనిని దృష్టిలో పెట్టుకొని బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. దళితుల సంక్షేమానికి కృషి చేసినట్టుగానే వారితో సమానంగా క్రైస్తవులను చూస్తామని అన్నారు. నగరంలో క్రైస్తవులకు ప్రత్యేక భవనం లేదని అన్నారు. పది కోట్ల రూపాయల వ్యయంతో ప్రత్యేక భవనాన్ని నిర్మిస్తామని, దీనికి సంబంధించి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు చెప్పారు. వచ్చే సంవత్సరం క్రైస్తవుల భవనంలోనే క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని అన్నారు. ఈ భవనానికి డిసెంబర్‌లోనే శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. భవన నిర్మాణ బాధ్యతను ఉప ముఖ్యమంత్రి టి రాజయ్యకు అప్పగిస్తున్నట్టు తెలిపారు. ఫాదర్లు, పాస్టర్లపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: