ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలపై అప్పుడే నిరసన స్వరాలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీని అమితంగా ఆదరించిన పశ్చిమగోదావరి జిల్లాలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక స్వచ్చంధ ఆందోళన మొదలైంది. రైతురుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ వంటి వ్యవహారాల్లో ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ ఆందోళనలు చేయగా.. ఇది మాత్రం స్వతహాగా ప్రజలు చేస్తున్నదే! మొదట పశ్చిమగోదావరిజిల్లాలో నిట్ ను ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అయితే ప్రతిపాదన దశలోనే ఆ నిర్ణయాన్ని మార్చుకొన్నారట. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని కృష్ణా జిల్లాకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. విద్యార్థులు స్వయంగా రోడ్డుకు ఎక్కారు. తాడేపల్లిగూడెంలో నిట్ ను ఏర్పాటు చేయాలని.. దాన్ని కృష్ణా జిల్లాకు తరలించవద్దని వారు అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీకి పశ్చిమలో సంపూర్ణ ఆదరణ లభించింది. ఈ రెండు పార్టీలూ ఇక్కడ స్వీప్ చేశాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశాన్ని ఇంతగా ఆదరించిన తమకు అన్యాయం చేస్తున్నారనే బాధ ఉంది ఇక్కడి ప్రజల్లో. అయితే ప్రభుత్వం మాత్రం ఇలాంటి ఆందోళనను లెక్క చేయడం లేదు. తాము అనుకొన్నదేంటో తాను చేస్తూ ముందుకు పోతున్న చంద్రబాబు ప్రభుత్వం రోడ్డుకు ఎక్కిన విద్యార్థులకు సమాధానం చెప్పడం లేదు. ఇలాంటి అసంతృప్తులు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: