తెలంగాణ ప్రజలు సహజంగానే కొంత రెబల్. ఇక్కడ పాలన విషయంలో ప్రభుత్వాలపై చాలా త్వరగా వ్యతిరేకత ప్రబలుతుంది. నేతల తీరును ఇక్కడ ప్రజలు ఎంత త్వరగా అభిమానిస్తారో..అంతే త్వరగా వారి తీరును వ్యతిరేకించడం కూడా జరుగుతూ ఉంటుంది. అనేక రాజకీయ సమీకరణాలను, చరిత్రను పరిశీలించి చూస్తే ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వ తీరుపై కూడా అలాంటి వ్యతిరేకతే ప్రబలుతోంది. చాలా విషయాల గురించి ప్రజలు బోలెడంత అసంతృప్తితో ఉన్నారు. ప్రత్యేకించి పెన్షన్లు, రేషన్ కార్డులు వంటి వ్యవహారాల గురించి తెలంగాణ లో సామాన్య ప్రజలే రోడ్డెక్కుతున్నారు. కలెక్టరేట్లను ముట్టడిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో గమనించదగ్గ విషయం ఏమింటే.. ఇక్కడి ప్రజల్ల అసంతృప్తిని ఒక వేదికపైకి తీసుకొచ్చే ప్రతిపక్ష పార్టీ లేదు! పేరుకు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ లు ప్రతిపక్ష పార్టీలు రెండు ఉన్నా.. ఈ రెండు పార్టీలూ ప్రజలను మాత్రం కలుపుకోలేకపోతున్నాయి,. కాంగ్రెస్ పార్టీ కి అంతర్గత కలహాలతో సమయం సరిపోతుంటే... తెలుగుదేశం పార్టీ కేవలం కేసీఆర్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకొంటోంది. ఎవరో కొంతమంది నేతలు మీడియా ముందుకు వచ్చి కేసీఆర్ కుటుంబం పై విరుచుకుపడటం తప్ప వేరే వ్యవహారం లేదు! నియోజకవర్గ స్థాయిల్లో ప్రజలను కలుపుకుపోయే వాళ్లు కనపడటం లేదు. దీంతో ప్రజలే స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ పరిస్థితిని చూస్తుంటే తెలంగాణలో సరైన ప్రతిపక్ష పార్టీ లోటు అయితే కనిపిస్తోంది!

మరింత సమాచారం తెలుసుకోండి: