ఆంధ్రాలో రుణమాఫీ వ్యవహారం గందరగోళంగా తయారైంది. అన్ని పత్రాలు సమర్పించినా మాఫీజాబితాలో పేరు రాని వారెందరో ఉన్నారు. కొందరికి అసలు ఏఏ పత్రాలు సమర్పించాలో.. సరిగ్గా అవగాహనలేదు. మరికొందరికి తమ పేరు జాబితాలో ఎందుకు రాలేదో తెలియదు.. రావాలంటే ఏంచేయాలో సరిగ్గా చెప్పే నాథుడే లేడు.                                      ఈ గందరగోళాన్ని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సరిగ్గా ఉపయోగించుకున్నారు. సర్కారు తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. రుణమాఫీ కాని వారు నేరుగా మంత్రి ప్రత్తిపాటికే ఫోన్ చేసి కనుక్కోండంటూ మంత్రి ఫోన్ నెంబర్ ప్రకటించారు. ఇది కాస్తా మీడియాలో ఫుల్లుగా వచ్చేసింది. ఇంకేముంది. అప్పటి నుంచి ప్రత్తిపాటికి ఫోన్ కష్టాలు మొదలయ్యాయి. నిమిషం కూడా ఖాళీలేకుండా ఆ ఫోన్ మోగుతూనే ఉంది. రైతుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ప్రత్తిపాటి బేజారెత్తిపోతున్నారు. అసెంబ్లీలాబీల్లో ఆయన తనగొడు మీడియాకు వెల్లబోసుకున్నారు.                                          విలేకర్లతో మాట్లాడుతున్న సమయంలోనే ఓ రైతు ఆయనకు ఫోన్ చేసి.. తన అనుమానాలు బయటపెట్టాడు. ప్రశ్నల వర్షం కురిపించాడు. ఏకంగా పావుగంట సేపు వాయించాడు. ఆ ఫోన్ అలా పెట్టేశారో లేదో.. ఇంకో.. ఇదండీ వరుస అంటూ ఆయన మీడియాకు వివరించి.. ఆ ఫోన్ పీఏ కు ఇచ్చి సభలోకెళ్లిపోయారు. రుణమాఫీ నా చావుకొచ్చిందిరా బాబూ.. అనుకుంటూ ప్రత్తిపాటి పీఏ నెత్తీనోరూ బాదుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: