మొన్ననే లేక్ వ్యూ అతిధిగృహం రిపేరీ పనులు పూర్తయ్యాయి. దాని కోసం ఏపీ ప్రభుత్వం కోట్ల రూపాయలను వెచ్చింది. దాదాపు ఇరవై కోట్ల రూపాయల పై మొత్తాన్ని వెచ్చించి ఏపీ ముఖ్యమంత్రి కోసం లేక్ వ్యూను క్యాంప్ ఆఫీసుగా తీర్చిదిద్దింది. అంతే కాదు.. ఆంధ్రప్రదేశ్ పాలన కోసం హైదరాబాద్ లోని మరికొన్ని భవనాలకు కూడా ఏపీ ప్రభుత్వం భారీగానే ఖర్చు పెట్టింది. ఇలాంటి నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి తాజాగా ఒక ప్రకటన చేశారు. త్వరలోనే ఏపీ పాలనను ఏపీ నుంచే మొదలు పెడతామనేది ఆ ప్రకటన సారాంశం. హైదరాబాద్ లోని వివిధ ఆఫీసులను సీమాంధ్రకు తరలిస్తామని బాబు చెప్పారు. అయితే ఇది కొత్తగా చెప్పింది కాదు. ఇది వరకూ కూడా బాబు ఇలా చెప్పారు. డేరాలు వేసుకొని అయినా సీమాంధ్ర నుంచే పాలన సాగిస్తామని బాబు ఇది వరకే చెప్పాడు. ఇప్పుడు కూడా ఆయన అదే చెబుతున్నాడు. మరి ఒకవైపు హైదరాబాద్ లో రిపేర్లు చేయించుకొంటున్న ముఖ్యమంత్రే.. ఇలా మాట్లాడటంతో ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. మరి ఇంతకీ కథేంటి.. అని అధికారులను కదిలిస్తే... ఒకవేళ సీమాంధ్రకు కొన్ని కార్యాలయాలను తరలించినా.. అవి చాలా తక్కువ శాతమే అవుతాయని వారు అసలు విషయాన్ని చెబుతున్నారు. పది నుంచి పదిహేను శాతం ఆఫీసులను కదిలిస్తామని.. మిగిలినవి మాత్రం హైదరాబాద్ నుంచి కదిలే అవకాశాలు లేవని వారు చెబుతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సెక్రటేరియట్ లు హైదరాబాద్ నుంచి సీమాంధ్రకు తరలితే తప్ప ఆంధ్రప్రదేశ్ పాలన ఆ ప్రాంతం నుంచే కొనసాగే అవకాశాలు ఏమాత్రం ఉండవని వారు వివరిస్తున్నారు. ఎలాగూ చంద్రబాబు అధికారం ఉన్నన్ని రోజులూ హైదరాబాద్ ను వదులుకొనే అవకాశాలూ.. ఇక్కడ నుంచి అటువైపు వెల్లే అవకాశాలు లేవనేది స్పష్టమవుతున్న అంశం. ఈ నేపథ్యంలో సీమాంధ్ర నుంచి పాలన అని బాబు చెబితే అది ఉత్తుత్తిమాట అనే అనుకోవాలేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: