రాజకీయాల్లో ఎంతటి వారికైనా.. కొన్నిసార్లు గడ్డుకాలం తప్పదు. కాలం కలసిరానప్పుడు ఎవరినీ నిందించి ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర నేత బొత్స సత్యనారాయణ పరిస్థితి అదే. వైఎస్ హాయంలో ఓ వెలుగు వెలిగిన ఈ నేత ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ ఏంటో అర్థంకాక తలపట్టుకుంటున్నారు. ఉన్న కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని అర్థమైపోయింది. ఒక పార్టీలో ఓ స్థాయిలో వెలిగిన నేతకు పార్టీ మారాల్సిరావడమంటే కష్టమైన విషయమే. అందులోనూ బొత్స పీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేశారాయె. ఐనా.. సరే మనసుకు సర్ది చెప్పుకుని పార్టీ మారదామని నిర్ణయించుకున్నా అక్కడా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి.                                                         బొత్సకు ఉన్న ఛాన్సులు మూడు.. టీడీపీ, బీజేపీ..వైసీపీ... టీడీపీ, వైసీపీల్లోకి ఎలాగూ వెళ్లలేరు. ఇక కమలం పార్టీయే దిక్కని అందులో చేరేందుకు ఆయన తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే.. పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావుల ద్వారా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను కలవాలని ప్రయత్నించారట. వర్క్ ఔట్ కాలేదు. చివరిగా సినీ నటుడు పవన్ కళ్యాణ్ ద్వారా అమిత్‌షాను కలిసినట్టు తెలుస్తోంది. అమిత్ షా బొత్స గురించి ఇక్కడి బీజేపీ వర్గాల ద్వారా సమాచారం సేకరించి.. పార్టీలో చేర్చుకునేందుకు కాస్త సానుకూలత వ్యక్తం చేశారట.                                         ఈ విషయం తెలుసుకున్న బాబు... బొత్సను ఎలాగైనా బీజేపీలో చేరకుండా చేయాలని ప్లాన్లు వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో బలమైన నేతగా ఉన్న బొత్స బీజేపీలోకి వస్తే.. తనకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవని బాబు భావిస్తున్నారు. అందుకే తెలివిగా కొన్ని రోజులుగా బొత్స అవినీతిని వెలికి తీసే పనిలో పడ్డారు. విజయనగరంలో రుణాల మంజూరులో అక్రమాలు జరిగాయని లేటేస్టుగా వస్తున్న వార్తలు ఆయన పుణ్యమే. బొత్సకు సంబంధించిన వ్యవహారాలన్నీ వెలుగులోకి తీసుకురావాలని, అవసరమైతే అసెంబ్లీలో ప్రస్తావించాలని జిల్లాలోని తమ నేతలకు చంద్రబాబు సూచించినట్టు తెలిసింది. సీబీసీఐడీ, ఏసీబీల చేత విచారణ జరిపించి బొత్సను ఇరకాటంలో పెట్టేందుకు పక్కా వ్యూహరచన చేసినట్టు తెలిసింది. మరి బొత్సను బీజేపీలో చేరకుండా చేయడంలో బాబు సక్సస్ అవుతారో లేదో..?

మరింత సమాచారం తెలుసుకోండి: