ఢిల్లీ అసెంబ్లీని ఎలాగోలా హస్తగతం చేసుకోవాలని కసి మీదున్న అరవింద్ కేజ్రీవాల్ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్-కు కోట్ల రూపాయల నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదే బీజేపీ ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. బీజేపి ఆరోపణలపై నీళ్లు నములుతూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న ఏకే బీజేపీపై పరువునష్టం కేసు వేస్తానని హూంకరిస్తున్నారు. ఆప్-లో అసలేం జరుగుతోంది! సామాన్యుల పార్టీగా ప్రాణం పోసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర రాజకీయ పార్టీల బాటనే పయనిస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడిపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ తన రాజకీయ తంత్రాన్ని మరింత దూకుడుగా చేస్తోంది. ఆప్ ఎన్నికల నిధులన్నీ స్వచ్ఛందంగా సేకరించినవేనని బిల్డప్ ఇచ్చిన మఫ్లర్ మ్యాన్ కేజ్రీవాల్ గత ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టారో తెలియదు. కానీ తాజాగా ఆప్ చేస్తున్న ఖర్చు మాత్రం అందరికీ షాక్ ఇస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ ఖర్చు పెడుతున్న మొత్తం ఎంతో తెలుసా? అక్షరాలా వంద కోట్ల పైమాటేనట. ఇప్పటికే ఆప్ 12 వందల కమర్షియల్ సైట్లలో మూడు నెలల పాటు ప్రచారం చేసుకునేందుకు బుక్ చేసుకుంది. ఒక్కొక్క సైట్-కు కనీసం 3 లక్షల రూపాయలు వెచ్చించాలి. ఇలా 12 వందల సైట్లంటే కనీసం వంద కోట్లు వెచ్చించాల్సిందే కదా. ఇక బస్ స్టాండ్-లతో పాటు పలు బహిరంగ ప్రాంతాల్లో, పేపర్లు, కరపత్రాల్లో, బ్యానర్లు, టీ షర్టులతో పాటు ప్రచార సామగ్రికి వెచ్చిస్తున్న సొమ్ము విలువెంత? మ్యూజికల్ నైట్స్-తో పాటు బహిరంగ సభల నిర్వహణకు, రోడ్-షోలకు కేజ్రీవాల్ టీం ఎంత ఖర్చు చేస్తోంది? అసలు ఈ భారీ మొత్తం అంతా ఎక్కడి నుంచి వస్తోందన్నది అసలు విషయం. సరే ఇంతకీ ఇన్ని కోట్లు ఆప్-కు ఎక్కడి నుంచి వచ్చాయంటే మాత్రం అంతు చిక్కదు. కేవలం ప్రజలిచ్చిన నిధులతోనే ప్రచారమంటున్న కేజ్రీవాల్ మాటలకు ఎన్నికల ఖర్చుకు పొంతన కుదరడంలేదు. ఎన్జీఓలు బినామీ పేరుతో, పలు మల్టినేషనల్ కంపెనీలు దొడ్డిదారిన కేజ్రీవాల్-కు ఎన్నికల నిధులు సమకూరుస్తున్నాయన్న బీజేపీ ఆరోపణలపై కేజ్రీవాల్ నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీపై పరువునష్టం కేసు దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. తమకు వస్తున్న నిధులు, వాటి ఖర్చుల వివరాలన్నీ వెబ్-సైట్లో ఉన్నాయని కేజ్రీవాల్ చెప్పుకొస్తున్నారు. కానీ హస్తినవాసులు కూడా కేజ్రీవాల్ బృందం ఖర్చు పెడుతున్న నిధులపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశముంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: