ఆంధ్రా రాజధాని నిర్మాణం కోసం... ప్రత్యేక బిల్లు తయారైంది. మంత్రి నారాయణ దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఐతే ఈ బిల్లు ద్వారా రాజధాని ప్రాంతానికి సంబంధించిన సర్వ హక్కులూ ఈ సీఆర్ డీఏ అప్పగించారు. రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములు సమీకరిస్తామని ... ఇవ్వకపోతే భూసేకరణ చట్టం ప్రయోగిస్తామని బిల్లులో స్పష్టంగా చెప్పేశారు. అంతేకాదు.. రాజధాని ప్రాంతంలో ఎలాంటి స్థిర, చరాస్తులనైనా సేకరించే అధికారాన్ని ఈ సంస్థకు కట్టబెట్టేశారు.                             బిల్లులోని మరి కొన్ని నిబంధనలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ కొత్త సంస్థకు స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకుని తన వద్దే ఉంచుకోవడం లేదా విక్రయించడం లేదా కాంట్రాక్టుకు ఇచ్చే అధికారం ఇచ్చారు. అంతేకాదు.. సేకరించిన ఏ భూమినైనా ప్రాధికార సంస్థ బదిలీ చేస్తుంది. ఆ భూమిని ఎటువంటి అవసరాలకైనా సంస్థ అమ్ముకోవచ్చని బిల్లులో స్పష్టం చేశారు. ఈ నిబంధనలను అడ్డుపెట్టుకుని.. ప్రభుత్వ పెద్దలు భూములను దుర్వినియోగం చేస్తే పరిస్థితి ఏంటని విపక్షనేతలు అంటున్నారు.                  కొత్త బిల్లు ప్రకారం భూసమీకరణను కేవలం 30 రోజుల్లో పూర్తి చేస్తారట. అందుకే సమీకరణ కోసం 62 మంది అధికారులను నియమిస్తారట. తొలిదశలో 29 గ్రామాల్లో 30 వేల ఎకరాలు సేకరించాలని సర్కారు నిర్ణయించింది. బిల్లులో ఉపయోగించిన పదజాలంపట్ల కూడా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వాడుకలో లేని గ్రాంధిక పదాలను ఉపయోగించడం ద్వారా మరింత గందరగోళానికి తెర తీశారని విమర్శిస్తున్నారు. అనుషంగికం, ఉత్తరాదాయి, విహిత, ప్రారంభిక, ప్రదత్త, వైయక్తిక వంటి సామాన్యులకు అర్థంకాని పదాలెన్నో బిల్లులో దర్శనమిచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: