వచ్చే ఏడాది శాసనసభ బడ్జెట్‌ (2015--16) సమావేశాలు ప్రారంభమయ్యే లోపు మంత్రివర్గాన్ని విస్తరించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు నిర్ణయించి నట్లు సమాచారం. మంత్రివర్గంలో తమకు చోటు కల్పించాలని తనను కలుస్తున్న ఆయా జిల్లాలకు చెంది న శాసనసభ్యులు, మండలి సభ్యులకు ఇదే రకమైన సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేని కడప జిల్లాకు విస్తరణలో స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఒక్కో మంత్రి ఉన్న జిల్లాలో ఇద్దరు మంత్రులకు అవకాశం కల్పించాలని 15 నియోజకవర్గాలకు పైగా ఉన్న జిల్లా లలో ముగ్గురు మంత్రులను నియమించాలన్న యోచ నతో ముఖ్యమంత్రి ఉన్నట్లు చెెబుతున్నారు. సాధారణ ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్న తెదేపా జూన్‌ 8న సీఎం చంద్రబాబుతో పాటు మరో 19 మంది మం త్రులు ప్రమాణ స్వీకారం చేశారు. నిబంధనల ప్రకారం మంత్రివర్గంలో సీఎంతో కలిపి 27 మంది ఉండవచ్చు. ప్రస్తుతం సీఎంతో కలిపి 20 మంది మాత్రమే ఉన్నారు. వచ్చే విస్తరణలో మరో 7 మందికి అవకాశం కల్పించేం దుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ విస్తరణలో సగానికి సగం మందికి శాఖల మార్పు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. తమ శాఖలపై పట్టు సాధించాలని, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువ కావాలని మంత్రిమండలి సమావేశంలో తరచూ చెబుతున్నా కొందరు మంత్రు లు తమ శాఖలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణ లు వెల్లువెత్తున్నాయి. మరికొంత మంది మంత్రుల పనితీరుపై రాష్ట్ర గూఢచార విభాగం ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబుకు రహస్య నివేదికను అందజేసిన విషయం తెలిసిందే. ఈ నివేదికల ప్రకారం మంత్రుల శాఖల్లో భారీ ఎత్తున మార్పులు ఉండే అవకాశం లేకపోలేదని తెదేపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నిమ్మకాయల చినరాజప్ప, కర్నూలు జిల్లాకు చెందిన కె.ఇ. కృష్ణమూర్తికి ఉప ముఖ్యమంత్రి పదవులను కట్టబెట్టారు. వీరిలో రాజప్పకు హోంశాఖతో పాటు విపత్తు నిర్వహణ శాఖను ఇవ్వగా, కేఈకి రెవెన్యూతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను అప్పగించిన విషయం తెలిసిందే.  ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలలో అత్యధికంగా అసెంబ్లిd నియోజకవర్గాలు ఉండటంతో ఈ జిల్లాల నుంచి మంత్రి వర్గంలో మరొకరికి అవకాశం ఉండవచ్చునన్న కథనాలు వెలువడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు తొలి మంత్రివర్గంలో అచ్చెన్నాయుడుకు అవకాశం దక్కింది. ఈ దఫా విస్తరణలో సీనియర్‌ ఎమ్మెల్యేలు కిమిడి కళా వెంకట్రావు లేదా గౌతు శ్యాం సుందర్‌ శివాజీకి అవకాశం రావచ్చన్న ప్రచారం ఉంది. విజయనగరం జిల్లా నుంచి మరొకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు. ఈ జిల్లాకు చెందిన కిమిడి మృణాళిని మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లాకు సంబంధించి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మంత్రివర్గంలో ఉన్నారు. కొత్తగా మరెవరికీ అవకాశం దక్కకపోవచ్చని భావిస్తున్నా జిల్లాకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మంత్రివర్గంలో స్థానం కోసం తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. మంత్రిపదవి ఇవ్వడానికి అవకాశం లేని పక్షంలో ముఖ్యమైన కార్పొరేషన్‌ పదవిని కట్టబెట్టాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ జిల్లా నుంచి బీసీ లేదా దళిత వర్గానికి చెందిన వారికి విస్తరణలోఅవకాశం కల్పించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ జిల్లాలో శెట్టిబలిజ సామాజిక వర్గంతో పాటు బలంగా ఉన్న మాల సామాజికవర్గం మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పీతల సుజాత, భాజపాకు చెందిన దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు సభ్యులుగా ఉన్నారు. జిల్లాలో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. ఈ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని భావిస్తే ఉండి ఎమ్మెల్యే శివబాబు కు ఛాన్స్‌ దక్కే అవకాశం ఉంది. కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని ఉమ, భాజపాకు చెందిన కామినేని శ్రీనివాస్‌, కొల్లు రవీంద్ర మంత్రులుగా ఉన్నారు. ఈ జిల్లాకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం అనుమానమేనని అంటున్నారు. గుంటూరు జిల్లాలో ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు మంత్రులుగా ఉన్నారు. కొత్తగా మరొకరికి విస్తరణలో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఆశా వహులంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పాటు ఎమ్మెల్యే లుగా గెలిచిన వారంతా సీనియర్లు కావడంతో ఎవరిని మంత్రులుగా చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు జి.వి. ఆంజనేయులు, ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, దూళిపాళ్ల నరేంద్రకుమార్‌, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్‌లు మంత్రివర్గంలో చోటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు ఇదే జిల్లాతో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో జిల్లాకు విస్తరణలో మంత్రిపదవి దక్కుతుందా లేదా అన్న సంశయంలో పార్టీ నేతలున్నారు. ప్రకాశం జిల్లాలో శిద్ధా రాఘవరావు మంత్రిగా ఉన్నారు. కాగా విస్తరణలో మరొకరికి అవకాశం దక్కవచ్చన్న ప్రచారం ఉంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి శాసనమండలి సభ్యుడు నారాయణ మంత్రిగా ఉండగా, విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నారు. జిల్లాకు చెందిన తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రి పదవిని కట్టబెట్టాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లాకు చెందిన విస్తరణలో స్థానం ఉండే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చంద్రబాబుతో పాటు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కడప జిల్లా విషయానికి వచ్చే సరికి జిల్లా నుంచి రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లిఖార్జునరెడ్డి గెలుపొందగా ఆయనకు సీఎం చంద్రబాబు విప్‌ పదవిని ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఉన్న సతీష్‌రెడ్డిని శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా నియమించారు. విస్తరణలో అవకాశం ఇచ్చి డిప్యూటీ చైర్మన్‌ పదవిని బీసీ వర్గాలకు ఇచ్చే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు. అనంతపురం జిల్లాలో మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘు నాథ్‌రెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాలోని హిందూపురం ఎమ్మెల్యేగా సినీ నటుడు బాలకృష్ణ ఎన్నికవడంతో ఈ నియోజకవర్గం టికెట్‌ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే అబ్ధుల్‌ ఘనీకి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి మంత్రివర్గంలో చోటు కల్పించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలిసింది. ఇది సాధ్యం కాని పక్షంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పార్టీ ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ షరీఫ్‌ను ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రిగా నియమించే అవకాశాలున్నాయి. అయితే బాలకృష్ణ ఒత్తిడి మేరకు అబ్ధుల్‌ఘనీకే అవకాశం ఉండవచ్చునన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది. కర్నూలు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి తోడుగా మరొకరిని మంత్రిగా నియ మించే అవకాశాలున్నాయి. రెండవ మంత్రి ఎవరన్న దానిపై బాబు కసరత్తు చేస్తు న్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు విస్తరణలో బడుగు బలహీనవర్గా లకు ప్రాధాన్యత కల్పించాలని సీఎం భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో చంద్రబాబుతో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు ఐదుగురు ఉన్నారు. కాపు, బీసీలు ఐదుగురు చొప్పున, ఎస్సీలు ఇద్దరు, రెడ్డి సామాజిక వర్గానికి ఇద్దరు, వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు ఒకరున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: