ఆంధ్రా రాజధానిగా ఎన్నో కసరత్తుల తర్వాత కృష్ణా తీరాన ఉన్న గుంటూరు జిల్లా ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. తుళ్లూరు కేంద్రంగా రాజధాని ప్రాంతాన్ని డిసైడ్ చేశారు. తొలివిడతలో దాదాపు 29 గ్రామాల పరిధిలో రాజధానిని నిర్మించాలని డిసైడ్ చేశారు. ఈ మేరకు సింగపూర్ తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి ఈ సమయంలో రాజధాని ప్రాంతాన్ని మార్చే అవకాశం ఉందా.. తుళ్లూరు ప్రాంతం నుంచి రాజధాని దూరం కాబోతుందా.. ?                                     ఇప్పుడీ వార్తలు ప్రభుత్వవర్గాల్లో షికారు చేస్తున్నాయి. ఇంత జరిగాక రాజధాని మారుస్తారంటూ వస్తున్న వార్తలకు ఆధారమేంటి.. అందుకు తగిన కారణాలేంటని ఆలోచిస్తే.. కృష్ణానదీతీర ప్రాంతంలోని ఓండ్రు మట్టి నేలలు భారీ అంతస్తుల నిర్మాణాలకు అనుకూలం కాదని కేంద్ర సంస్థలు ఓ నివేదిక తయారు చేశాయట. భూభౌతిక విభాగాలకు చెందిన సంస్థ.. ఈ మేరకు అధ్యయనం చేసిందట. భూమి గట్టిదనంలో ప్రస్తుతం ఎంచుకున్న ప్రాంతానికి సీ గ్రేడు లభిస్తే.. అటు నూజివీడు ఇటు దొనకొండ ప్రాంతాలకు ఏ గ్రేడు వచ్చిందట.                                           రాజధాని నిర్మాణంలో భాగంగా మెట్రో రైలు ప్రాజెక్టులు, ఆకాశహర్మ్యాలు, భారీ అంతస్తులు కట్టాల్సి ఉన్నందువల్ల.. తుళ్లూరు ప్రాంతం అంత సురక్షితం కాదని ఆ నివేదక చెప్పిందట. ఐతే.. ఇంతవరకూ వచ్చాక రాజధాని ప్రాంతాన్ని మార్చే అవకాశమే ఉండదంటున్నారు మరికొందరు. మలేషియా, సింగపూర్, యూఏఈ వంటి దేశాలు ఏకంగా సముద్రంలో భవనాలు నిర్మిస్తుంటే.. తుళ్లూరు ప్రాంతంలో నిర్మించడానికి ఇబ్బందేముందంటున్నారు. ఒక వేళ మారిస్తే మాత్రం దొనకొండ కంటే నూజివీడుకు మార్చవచ్చన్న కథనాలు వెలువడుతున్నాయి. ఏదేమైనా రాజధాని కృష్ణా, గుంటూరు జిల్లాలను దాటిపోదని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: