రుణమాఫీపై చర్చ సమయంలో ఆంధ్రా అసెంబ్లీలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జగన్, రోజాలను ఉద్దేశించి టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ప్రత్యేకించి రోజాను పేరుపెట్టి మరీ గోరంట్ల విమర్శించారు. ఆమె సినిమాల్లో ఏం నటించిందో కానీ.. ఇక్కడ మాత్రం విలన్ గా ప్రవర్తించిందంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాదు... ఇది సినిమాకాదు.. అసెంబ్లీ అన్నారు. దాంతో పాటు ఇది మీ ఇడుపులపాయి ఎస్టేట్ అనుకున్నారేమో.. ఇది అసెంబ్లీ.. ఆ రోజా ప్రవర్తన దారుణంగా ఉంది. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఊరుకోం.. జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు.                                          గోరంట్ల వ్యాఖ్యలతో సభలో ఉద్రిక్తత నెలకొంది. తనను పేరు పెట్టి విమర్శించడంపై రోజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రోజా.. ఆమెకు మద్దతుగా మరికొందరు వైసీపీ సభ్యులు పోడియం ముందుకు వచ్చి నినాదాలు చేశారు. తనను విమర్శిస్తున్నందువల్ల.. తనకు వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలని రోజా చాలాసేపు పోడియం వద్దే ఉండి నినాదాలు చేశారు. కానీ స్పీకర్ కోడెల ఆమె నినాదాలను పెద్దగా పట్టించుకోలేదు.                               ఓ వైపు రోజా నిరసన చేస్తూనే ఉన్నా.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏమాత్రం తగ్గలేదు. వైసీపీ తీరుపైనా.. రోజా తీరుపైనా విమర్శలు కొనసాగించారు. పరిస్థితి అదుపుతుప్పుతుందని.. సభ సజావుగా సాగే పరిస్థితి లేదని గమనించిన స్పీకర్ సభను ఉద్రిక్తత మధ్యనే.. సభను వాయిదా వేశారు. సాధారణంగా వాయిదాతో సీన్ అక్కడితే ముగిసిపోవాలి. కానీ గోరంట్ల ఘాటు వ్యాఖ్యలు చేయడం వల్ల.. దాని తీవ్రత సభ వాయిదా పడిన తర్వాత కూడా కొనసాగింది. వైసీపీ సభ్యులు రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సభ వాయిదా పడిన తర్వాత గోరంట్ల వైపు దూసుకొచ్చి గొడవ పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: