తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అక్కినేని ఫ్యామిలీ అంతగా ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా కనిపించడం లేదు. తమ తండ్రి పేరు మీదుగా అక్కినేని వారసులు నెలకొల్పిన "అక్కినేని అవార్డు'' ప్రదానోత్సవ కార్యక్రమ విషయంలో ఏపీ ముఖ్యమంత్రికి గానీ, ఏపీ ప్రభుత్వ తరపు వారికి గానీ ఆహ్వానాలు అందకపోవడంతో ఇలాంటి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అక్కినేని అవార్డు ను తొలివిడతగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కు ఇస్తున్నారు. ఈ అవార్డును అమితాబ్ బచ్చన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రదానం చేయనుండటం విశేషం! ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులు ముఖ్య అతిధులు అని తెలుస్తోంది. వీరిలో వెంకయ్యను ఏపీ ప్రభుత్వ ఖాతాలోని వ్యక్తి గా వేసుకోలేం. ఆయన కేంద్ర ప్రభుత్వ ఖాతాలోని వ్యక్తి అవుతాడు. దీంతో ఏపీ ప్రభుత్వ తరపు నుంచి ఈ కార్యక్రమానికి ఎవరు ఆహ్వానితులవుతారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించడం అయితే లేదనుకోవాల్సి వస్తోంది. వేరే ఎవరైనా మంత్రులో.. ఎమ్మెల్యేలో వచ్చినా రావొచ్చునేమో! అయితే అక్కినేని నాగేశ్వరరావు జన్మతః ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అవుతారు. అలాంటి వ్యక్తిపేరుమీద ఏర్పాటు చేసిన అవార్డు కాబట్టి... ఏపీ ప్రభుత్వ పెద్దలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాల్సింది. అందులోనూ చంద్రబాబు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి కూడా. అయినా అక్కినేని ఫ్యామిలీ ఛాయిస్ మాత్రం కేసీఆర్ అయ్యాడు. హైదరాబాద్ లో చెల్లేది కేసీఆర్ అధికారం మాటే కాబట్టి... తెరాస అధినేతకే ప్రాధాన్యత అనమాట!

మరింత సమాచారం తెలుసుకోండి: