లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్‌డీఏ ఇచ్చిన పలు హామీలు, మత మార్పిళ్లపై కొనసాగుతున్న వివాదంతో పాటు పలు అంశాలపై ఎన్‌డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనతా పరివార్‌ సోమవారం న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద భారీ ధర్నా నిర్వ హించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు వెల్లువెత్తాయి. సమాజ్‌వాదీ పార్టీ, జనతాదళ్‌-యునైటెడ్‌(జేడీయూ), రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్‌జేడీ), ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌(ఐఎన్‌ఎల్‌డీ)తో పాటు పలు చిన్నాచితకా పార్టీలు ధర్నాలో పాల్గొన్నాయి. జనతా పరివార్‌ మహాధర్నాకు భారీగా నాయకులు, కార్యకర్తలు కదిలి వచ్చారు. మోడీ ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు గల్లంతైనట్లు ధర్నాకు హాజరైన జన సందోహం రుజువు చేసింది. జనతా పరివార్‌ పార్టీలన్నీ సమాజ్‌వాదీ జనతాదళ్‌గా ఆవిర్భవించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. లాలు, నితీష్‌, ములాయం సింగ్‌ యాదవ్‌ నాయకత్వంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నూతన రాజకీయ వేదికను రూపొందించనున్నారు. వేదికను పంచుకున్న నాయకులంతా బ్లాక్‌మనీపై దృష్టి కేంద్రీ కరించారు. ఎన్నికల హామీలు విస్మరించడాన్ని ప్రశ్నించారు. బీహార్‌ మాజీ ముఖ్య మంత్రి, జేడీయూ సీనియర్‌ నేత నితీష్‌కుమార్‌ ప్రసంగిస్తూ రెండు లాంఛనప్రాయమైన సమావేశాలతో పాటు పలు విడతలుగా తాము చర్చించామని, తమ పార్టీలు చేతులు కలిపి నేటి మహాధర్నాకు నిర్ణయం తీసుకున్నాయన్నారు. పూర్వపు జనతా పరివార్‌ ఐక్యమయ్యేందు దాదాపు నిర్ణయించామన్నారు. జనతా పరివార్‌ పార్టీలన్నీ ఒకే పార్టీగా ఆవిర్భవించడానికి సంబంధించిన విధివిధానాలపై ఎస్పీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ కసరత్తు చేస్తున్నారన్నారు.  ఇకపోతే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఎందుకు విఫలమైందని నితీష్‌ సూటిగా ప్రశ్నించారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసు కొస్తామని హామీ ఇచ్చారు. ఆ నల్లధనం ఎక్కడీ అని నిలదీశారు. మితవాద హిందూ సంస్థలు ఇటీవల పెద్దఎత్తున మత మార్పిళ్లకు పాల్పడు తున్నా మోడీ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారని నితీష్‌ విమర్శించారు. మత మార్పిళ్లపై ప్రధాని వైఖరేమిటో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. మతం పేరుతో దేశాన్ని విభజించవద్దని హితవు పలికారు. మత మార్పిళ్లకు హిందూ సంస్థలు పెద్దఎత్తున డబ్బు ఖర్చుచేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో బీజేపీ తప్పుడు హామీలు గుప్పించిందన్నారు. ఆ హామీలు అమలు చేయలేక, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని తట్టుకోలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు మత మార్పిళ్ల వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చిందని ఎండగట్టారు. తాయిలాలు ఆశచూపి మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని, వినకపోతే భయపెడుతున్నారని నితీష్‌కుమార్‌ ఆరోపించారు. బలవంతంగా మత మార్పిళ్లు చేయాల్సిన అవసరం ఏమిటని నిందించారు. బీజేపీని అన్ని విధాలా అడ్డుకోవడానికి ప్రతిపక్షాలన్నీ సంఘటితం కావాల్సిన అవసరాన్ని వక్కా ణించారు. ఆర్‌జేడీ అధినేత లాలు ప్రసాద్‌ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ మతోన్మాదం, తప్పుడు హామీలను ఎండగట్టారు. 'దేశాన్ని పరిరక్షించడంలో మీరు వైఫల్యం చెందారు. నల్లడబ్బు ఎక్కడీ నల్లకుబేరులు ఎక్కడ వున్నారు? ఎంత నల్లడబ్బును గుర్తించారు? ఎంత భారత్‌కు తీసుకువచ్చారు? నల్లకుబేరులు ఎవరు?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నల్లధనంపై రంకెలేసిన రాందేవ్‌ ఇప్పుడెక్కడున్నారు? అని నిలదీశారు. నల్లధనంపై రామ్‌దేవ్‌ మౌనానికి అర్ధమేమిటి? అని అడిగారు. విదేశాల్లో మూలుగుతున్న బ్లాక్‌మనీని భారత్‌కు తీసుకురావడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. 'రామ్‌దేవ్‌కు ట్వీట్‌ చేయమని మా అబ్బాయి తేజస్వికి చెప్పాను. నల్లధనం గురించి నిలదీయమని చెప్పాను' అని లాలు అన్నారు. ఎన్నికలకు ముందు బీజేపీకి మద్దతుగా యోగా టీచర్లతో బాబా రామ్‌దేవ్‌ ప్రచారం చేయడాన్ని లాలు గుర్తు చేశారు. 'నల్లధనం ఎప్పుడు వెనక్కి వస్తుందా అని మేమంతా ఎదురుచూస్తున్నాం. మరికొన్ని నెలలు ఎదురుచూస్తాం. బ్లాక్‌మనీని విమానాల్లో మీరు తీసుకురాలేకపోతే అందుకోసం మేము ఒంటెలు ఏర్పాటు చేస్తాం' అని లాలు ప్రధాని మోడీని ఎద్దేవా చేశారు. మోడీ విదేశీ పర్యటనలను కూడా లాలు ప్రశ్నించారు. చైనా చొరబాట్లు కొనసాగుతున్నాయి. చైనా సైనికులు భారత్‌లో ఏడు కిలోమీటర్ల లోపలకు చొరబడి వచ్చారు. మీరు మాత్రం ఉల్లాసంగా, ఉత్సాహంగా చైనా అధ్యక్షుని పక్కన కూర్చుని ఫొటోలు తీయించు కుంటున్నావ్‌ అంటూ విమర్శించారు. నితీష్‌, లాలు ప్రసంగానికి అనూహ్య స్పందన లభించింది. వారి ప్రసంగానికి సభికులు చప్పట్లు కొట్టారు. జనతా పరివార్‌ పార్టీలతో ఎస్‌పీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ గతనెలలో విందు సమావేశం ఏర్పాటు చేశారు. నితీష్‌కుమార్‌, శరద్‌యాదవ్‌, లాలు ప్రసాద్‌, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవగౌడ హాజరయ్యారు. పార్లమెంట్‌లో ప్రభావిత గ్రూపుగా పనిచేయాలని నేతలు నిర్ణయించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: