జమ్మూ-కాశ్మీరు, జార్ఖండ్‌ శాసనసభలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరుగుతుంది. బహుముఖ పోటీ జరిగిన ఈ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐదు దశల్లో దాదాపు నెలపాటు జరిగిన ఎన్నికల్లో 66 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఉగ్రవాదులు, మావోయిస్టుల వల్ల ఎన్నికలకు అంతరాయం కలగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి సంకేతాలు ఉదయం 9 గంటలకు తెలిసే అవకాశం ఉంది. లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.  జమ్మూ-కాశ్మీరులో 87 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వేర్పాటువాదులు, ఉగ్రవాదులు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చి నప్పటికీ 1987 తర్వాత అత్యధిక స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియో గించుకున్నారు. అధికారంలో ఉన్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య పోటీ జరిగింది. జార్ఖండ్‌లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఎన్నికలు జరిగిన 81 శాసనసభ నియోజకవర్గాల్లో 66 శాతం ఓటింగ్‌ నమోదైంది. 2000వ సంవత్సరంలో బీహార్‌ నుంచి జార్ఖండ్‌ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 54.2 శాతం పోలింగ్‌ నమోదైంది. 111 మంది మహిళలతో సహా 1,136 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 28 స్థానాలను ఎస్సీలకు, 9 స్థానాలను ఎస్టీలకు కేటాయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: