తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం క్రైస్తవభవన్‌కు శంకుస్థాపన చేశారు. మారేడ్‌పల్లి మండలం మహేంద్ర హిల్స్‌లోని రెండెకరాల స్థలంలో, రూ.10 కోట్ల వ్యయంతో క్రైస్తవ భవనాన్ని నిర్మించనున్నట్లు ఇటీవలే ముఖ్యమంత్రి ప్రకటించారు. శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన క్రిస్టియన్‌ సోదరీసోదరులకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ క్రిస్మస్‌, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భవన నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టేలా అధికారులు పనిచేయా లన్నారు. వచ్చే ఏడాది నూతనంగా నిర్మితమైన క్రైస్తవ భవన్‌లో క్రిస్టమస్‌ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిం చారు. ''ఇకపై ఉపన్యాసాలు తగ్గించి పని బాగా చేద్దాం'' అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రజలంతా సోదరభావంతో మెలగాలని, ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ద్వారా ఆశించిన ఫలితాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిఎం అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌ అలీ, టి.రాజయ్య, హోంశాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఇరిగేషన్‌ శాఖమంత్రి టి.హరీష్‌రావు, విద్యాశాఖమంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ఎక్సైజ్‌శాఖమంత్రి టి.పద్మారావు, వాణిజ్య పన్నుల శాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే జి.సాయన్న, సాంఘికసంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రేమండ్‌ పీటర్‌, మైనార్టీ సంక్షేమశాఖ సెక్రటరీ అహ్మద్‌ నదీమ్‌, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ సోమేష్‌ కుమార్‌, క్రిస్టియన్‌ మైనార్టీ కార్పొరేషన్‌ ఎండి. నవీన్‌ నికోలస్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఎన్‌.శ్రీధర్‌, ఇన్‌ఛార్జి జాయింట్‌ కలెక్టర్‌ బి.సంజీవయ్య, సికింద్రాబాద్‌ ఆర్డీవో రఘురామ్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: