అసోంలో ‘బోడో’ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 48 మంది ఆదివాసీలను ఊచకోత కోశారు. మంగళవారం ఒకే రోజు... ఐదుచోట్ల దాడులకు తెగబడ్డారు. సాయంత్రం ఐదు గంటలకు సోనిట్‌పూర్‌ జిల్లా మైతాలుబస్తీలో దారుణకాండ మొదలైంది. పభోయ్‌ అటవీ ప్రాంతంలోని ఆదివాసీలపై దాడికి దిగారు. ఈ ఒక్కచోటే సుమారు 30 మందిని బలి తీసుకున్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికే... కొక్రాఝార్‌ జిల్లాలోని పాఖ్రిగురి గ్రామంపై దాడి చేశారు. ఇక్కడ ముగ్గురిని చంపారు. ఆ వెంటనే కొద్దిసమయం తేడాలోనే సోనిట్‌పూర్‌ జిల్లాలోనే రెండుచోట్ల ఆదివాసీలపై దాడికి దిగారు. ఈ రెండుచోట్ల సుమారు 15 మందిని బలి తీసుకున్నారు. కొక్రొఝార్‌ జిల్లా ఉల్టాపానీలోనూ కాల్పులు జరిపినప్పటికీ... అక్కడ ఎవరూ చనిపోలేదు. ఉగ్రవాదులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో తొలుత 34 మంది చనిపోయినట్లు భావించారు. ఆ తర్వాత కూడా మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. వెరసి మృతుల సంఖ్య 48కి చేరిది. ఈ సంఖ్య మరింత పెరగవచ్చునని అధికారులు భావిస్తున్నారు. భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు నిలిపివేయకపోతే ప్రతీకార దాడులకు దిగుతామని సోమవారమే ఎన్‌డీఎఫ్‌బీ(ఎస్‌) ఉగ్రవాదులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాగా దాడులు జరిగిన ప్రాంతాలన్నీ ‘బోడోల్యాండ్‌ ప్రాదేశిక స్వయంప్రతిపత్తి’ (బీటీఏడీ) పరిధిలోని జిల్లాల్లోనివే. భారత్‌-టిబెట్‌ సరిహద్దుల్లోని మారుమూల గ్రామాలను ఎంచుకుని రక్తపాతం సృష్టించారు. తాజా పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: