శాసనసభలో మంత్రులు మౌనవ్రతం పాటించారు. శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షం వైకాపా, అధికార తెలుగుదేశం సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకోవడం, వైకాపా అధిపతి జగన్మోహన్‌రెడ్డి తెలుగుదేశంపై రుణమాఫీ, రాజధాని, కాంట్రాక్ట్ ఉద్యోగుల అంశం వంటివాటిపై తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. అయితే ఆ విమర్శలకు సమాధానం చెప్పడంలో మంత్రులు విఫలమయ్యారనే చెప్పవచ్చు. తొలిసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కింజరాపు అచ్చెన్నాయుడు మాత్రం వైకాపా విమర్శలను తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోహించగా, మధ్యలో ఆర్ధికమంత్రి యనమల కూడా అందిపుచ్చుకుంటూ వైకాపా దాడులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రతి చర్చలో చివరిలో కీలకంగా స్పందించడమే కాకుండా, మధ్యమధ్యలో కూడా వైకాపా దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టారు.  కిషోర్‌బాబు, పీతల సుజాత కొంత ఫరవాలేదనిపించారు. మిగిలిన మంత్రులు మాత్రం తమ స్థాయికి తగినట్లుగా స్పందించలేదని, ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానాలు చెప్పడం తప్ప పెద్దగా సాధించింది ఏమీ లేదని విమర్శలు ఉన్నాయి. ఐదు రోజులపాటు జరిగిన శాసనసభ సమావేశాల్లో తొలి రోజు దివంగత శాసనసభ్యుడు వెంకటరమణకు నివాళులు అర్పించగా, మిగిలిన నాలుగు రోజులు శాసనసభ హోరాహోరీగానే సాగించింది. వైకాపా తరఫున జగన్‌తోపాటు ఇతర సభ్యులుకూడా తెలుగుదేశం విధానాలపై తీవ్రంగా స్పందించారు. జగన్ అయితే ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీనికి మంత్రులనుంచి స్పందన అంతంతమాత్రంగానే కనిపించింది. మంత్రుల స్పందన చూసిన చంద్రబాబు ప్రతిసారీ తానే నిలబడి మాట్లాడాల్సి రావడం, అచ్చెన్నాయుడును తన ప్రధాన అస్త్రంగా వినియోగించడం కనిపించింది. సీనియర్ మంత్రులు కొంతమంది సభలోనే ఉన్నప్పటికీ వారు ఆశించిన స్థాయిలో స్పందించలేదు.  కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లోనే ఇటువంటి పరిస్థితి తలెత్తడంతో చంద్రబాబు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది మంత్రుల తీరుపై అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రికి తాజా శాసనసభ సమావేశాల్లో వారి తీరు మరింత అసంతృప్తికి కారణంగా మారినట్లు కనిపిస్తోంది. శాసనసభ సభలో వైకాపా మహిళా సభ్యురాలు రోజా వైఖరి తరువాత పీతల సుజాత స్పందించడం గమనార్హం. కాగా, అనేక మంది మంత్రులు సభ జరుగుతున్న సమయంలో కూడా లాబీల్లో సంచరిస్తూ పలువురు శాసనసభ్యులతో, మీడియాతో ముచ్చటించడానికే మొగ్గు చూపించినట్లు కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: