రాజధాని నిర్మాణంలో భూ సమీకరణపై నెలకొన్న సమస్యలు ఇంకా తొలగిపోవడం లేదు. గుంటూరు జిల్లాలో రాజధాని కోసం గుర్తించిన మూడు మండలాల్లో 80 శాతం మంది రైతులు తమ భూములను అప్పగించేందుకు సుముఖంగా ఉన్నారని చెబుతున్న ప్రభుత్వం, మిగిలిన 20 శాతం మంది రైతులను ఎలా దారికి తెచ్చుకోవాలన్నదానిపైనే దృష్టి పెడుతోంది. వ్యవసాయం మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లో రైతులు రాజధానికి భూములు అప్పగించేందుకు ముందుకు రాకపోవడం ఒక సమస్యగా మారగా, వైకాపా నేతలు అక్కడి రైతులను రెచ్చగొడుతున్నారన్న ప్రచారం మరోరకంగా ఇబ్బందులు కలిగిస్తోందని మంత్రులు అంటున్నారు. ఇదే సమయంలో ఆ ప్రాంతంలో కులాల సమస్య కూడా సర్కారుకు సమస్యగానే మారుతోంది. అలాగే రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ బిల్లులో కొన్ని అంశాలపై స్పష్టత లేకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల్లో ఉన్న అభద్రతాభావాన్ని తగ్గించేందుకు, భూ సమీకరణ సులభసాధ్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. ముందుగా భూ సేకరణ కన్నా, ల్యాండ్ పూలింగ్ విధానమే రైతులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందన్న అంశాన్ని రైతులకు వివరించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో రైతులు, ఏడాదిలో మూడు పంటలు చేతికి వచ్చే భూములున్న రైతులు భూములు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు ఇచ్చే ఏడాదికి 30, 50 వేల జీవనభృతి ఎంతమాత్రం సరిపోదని, మూడు పంటలు వచ్చే ప్రాంతాల రైతులు అంటున్నారు. అందుకే అవసరమైతే ఇటువంటి భూములున్న రైతులకు మరింత అదనపు మొత్తాన్ని కూడా చెల్లిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.ఇక రాజధాని నిర్మాణ ప్రాంతంలో ఉన్న వారిని ఆకట్టుకునేందుకు కులాలవారీగా కూడా సమావేశాలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను ప్రభుత్వం చేస్తోంది. త్వరలోనే దీనిపై ఒక కార్యాచరణ ప్రకటించాలని యోచిస్తోంది. విడివిడిగా కుల పెద్దలతో చర్చించడం ద్వారా వారిని రాజధాని నిర్మాణానికి సానుకూలంగా మలచాలని భావిస్తున్నారు. ఇక రాజకీయంగా వివిధ పార్టీలు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్న ప్రభుత్వం, రైతులకు వాస్తవాలు వివరించడంలోమాత్రం విఫలమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. శాసనసభ జగన్ చేసిన ప్రసంగం కూడా కేవలం రైతుల్లో అనుమానాలు సృష్టించే ప్రయత్నంగానే ఉందని ఒక మంత్రి వ్యాఖ్యానిస్తూ... దానికి ఆశించిన స్థాయిలో సమాధానం చెప్పలేకపోయామన్న భావాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఇక సిఆర్‌డిఎ బిల్లులో రైతుల ప్యాకేజిలకు సంబంధించిన అంశాలపైకూడా చర్చ జరుగుతోంది. బిల్లులో రైతుల ప్యాకేజి అంశాలు లేకపోవడంపై ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. అయితే అటువంటి అంశాలు బిల్లులో ఉండవని, ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందని చెబుతున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా త్వరలోనే చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ప్రధానంగా భూమి ఇచ్చిన రైతులకు వెయ్యి గజాల నివాస స్థలం, మరికొంత వాణిజ్య స్థలాన్ని ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ అది బిల్లులో లేదని, అందుకే రైతుల్లో అభద్రతా భావం పెరుగుతోందని సీనియర్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. అందుకే నోటిఫికేషన్ విడుదల ద్వారా రైతులకు స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నారు. ఇలా ఉండగా, రాజధాని నిర్మాణం కోసం పునాదిరాయి వేసే అంశంపై కూడా స్పష్టత లేకుండాపోతోంది. వాస్తవంగా రాష్ట్రావతరణ దినంగా నిర్ణయించిన జూన్ రెండులోకాగా ఏదో ఒక చోట పునాదిరాయి వేయాలని ముందుగా అనుకున్నప్పటికీ.. అది ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పునాది వేసేందుకు కూడా మరో రెండేళ్లు పడుతుందని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి వ్యాఖ్యానించడం కొసమెరుపు

మరింత సమాచారం తెలుసుకోండి: