జార్ఖండ్‌లో బీజేపీ తగిన మెజారిటీ సాధించ టంతో ముఖ్యమంత్రి పదవికి ఆ పార్టీలో పోటీపెరిగింది. అర్జున్‌ ముండా, రఘువర్‌ దాస్‌, సుదర్శన్‌ భగత్‌, సరయూ రారు, సునీల్‌ సింగ్‌, గణేష్‌ మిశ్రా ఈ పదవికి పోటీ పడుతున్నారు. బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించటంతో ముఖ్యమంత్రి పదవిని తామే పొందాలని నాయకులు పోటీపడుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానున్నది. ముఖ్మమంత్రి అభ్యర్థిపై రాజకీయ వర్గాలలో పుకారులు షికార్లు చేస్తున్నాయి. తొలుత బీజేపీ నాయకులు ఈ దఫా జార్ఖండ్‌కు గిరిజనేతర ముఖ్యమంత్రి రావచ్చునని ప్రకటించారు. హర్యానాలో వలే జార్ఖండ్‌లో కూడా ఆశ్చర్యకరమైన ఫలితాలు పొందేందుకు అలా ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవికి అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అందులో అర్జున్‌ ముండా పేరు ఒకటి. అయితే, ఖర్‌శ్వాన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన ఓడిపోయారు. ముఖ్యమంత్రి పదవికి పోటీపడుతున్న ఇతరులలో రఘువర్‌ దాస్‌, సుదర్శన్‌ భగత్‌, సరయూ రారు, సునీల్‌ సింగ్‌, గణేష్‌ మిశ్రా ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు అత్యంత సన్నిహితుడైన గణేష్‌ మిశ్రా పేరును బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. హర్యానాలో మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ వలే ఇక్కడ కూడా మిశ్రా పేరును సూచిస్తారని ఆ వర్గాలు భావిస్తున్నాయి.గిరిజనేతరులలో బీజేపీ నేత సరయూ రారు జంషెడ్‌పూర్‌ (తూర్పు) నియోజకవర్గం నుండి, చాత్రా నుండి లోక్‌సబకు ఎన్నికైన సునీల్‌ సింగ్‌ పేరును కూడా ముఖ్యమంత్రి పదవికి పరిశీలించవచ్చునని పార్టీ వర్గాలు తెలిపాయి. సరయూ రారు, సునీల్‌ సింగ్‌ ఇరువురూ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌కు అత్యంత సన్నిహితులు. బీజేపీ అగ్రనాయకత్వంతో సంబంధాలున్నాయి. ''రారుకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలన్ని పార్టీ నాయకత్వంతో పాటు కార్పొరేట్‌ సంస్థల నుండి కూడా ఒత్తిడి వస్తోంది'' అని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ నాయకుడు, 2010లో ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన రఘువర్‌ దాస్‌ జంషెడ్‌పూర్‌ (పశ్చిమ) నియోజకవర్గం నుండి విజయం సాధించారు. ఆయన ఈ పదవికి తీవ్రంగా పోటీపడుతున్నారు. ''నేను ఎప్పుడూ జార్ఖండ్‌ ప్రజల కోసం పనిచేస్తాను. ముఖ్యమంత్రిగా ఎవరిని చేయాలనేది పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుంది'' అని దాస్‌ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: