అమెరికాలో శ్వేతజాతిపోలీసుల క్రౌర్యానికి మరో నల్లజాతి యువకుడు బలయ్యాడు. మైఖెల్‌ బ్రౌన్‌ను చంపిన ప్రదేశానికి (సెయింట్‌ లూయిస్‌ ప్రాంతంలో) చేరువలోనే ఆంటోనియో మార్టిన్‌ అనే 18 ఏళ్ల నల్లజాతి యువకుడిని పోలీసులు అమానుషంగా కాల్చి చంపారు. దీనిపై ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. బర్కిలీ శివార్లలోవున్న సెయింట్‌ లూయీస్‌ ప్రాంతంలో పోలీసులు సాధారణ తనిఖీల నిమిత్తం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11.15 గంటల సమయంలో మొబైల్‌ గ్యాస్‌ స్టేషన్‌ వద్దకు వచ్చినపుడు ఇద్దరు అనుమానిత వ్యక్తులు తమ వద్దకు వచ్చారని పోలీసు అధికారులు తెలిపారు. అందులో ఒక యువకుడు చేతి తుపాకీని ఒక పోలీస్‌ అధికారికి గురి పెట్టాడని, వెంటనే ఆ అధికారి కాల్పులు జరపటంతో అతడు చనిపోయాడని అధికారులు ఎప్పటిలానే కట్టుకథలు అల్లారు. చనిపోయిన యువకుణ్ణి తాము ఇంకా గుర్తించలేదని పోలీసులు చెబుతుండగా అతడు తన కుమారుడు ఆంటోనియా మార్టిన్‌ అని అతడి తల్లి పేర్కొంది. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న స్థానికులు తీవ్ర ఆగ్రహంతోఅక్కడికిచేరుకుని పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణల్లో కనీసం ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు సెయింట్‌ లూయీస్‌ కౌంటీ పోలీసులు చెప్పారు. ఘర్షణల సమయంలో అక్కడ భారీ శబ్దాలు వినిపించాయని, పెద్దయెత్తున పొగ కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కుమారుడు చనిపోయాడని తెలుసుకున్న మార్టిన్‌ తల్లి టోనీ మార్టిన్‌ విలపిస్తున్న దృశ్యాలను, వీడియోలను కొందరు సోషల్‌ మీడియాలో పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: