టిడిపి రాయలసీమ నేతల్లో అసంతృప్తి చాపకింద నీరులా విస్తరిస్తోంది. అనంతపురం మినహా మిగిలిన మూడు జిల్లాల్లో ప్రజలు వైకాపాకు మద్దతివ్వడంతో చంద్రబాబు రాయలసీమపై దృష్టి సారించడం లేదని ఆ పార్టీలోని కొందరు నాయకులు పేర్కొంటున్నారు. విజయవాడ, విశాఖపట్టణం అంటూ తరచూ పర్యటిస్తూ పాలన కొనసాగిస్తున్నారే తప్ప రాయలసీమలోని పలు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నగరం విషయంలో సైతం రాయలసీమ ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని వారంటున్నారు. మంత్రిమండలిలో చంద్రబాబు అంతాతానై వ్యవహరిస్తున్నారని, అసెంబ్లీలో సైతం మంత్రులు ఇవ్వాల్సిన సమాధానాలను చంద్రబాబే ఇచ్చారని ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన అనంతపురం జిల్లా నేత జెసి దివాకర్‌రెడ్డి ఇటీవలి కాలంలో మౌనం వహించారు. కాగా టిడిపిలో రాజుకుంటున్న అసంతృప్తిని తమకనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో వైకాపా తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. రాయలసీమలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాము పోరాటం చేయడమే కాకుండా ఎవరు ఆందోళన నిర్వహించినా సహకారమందిస్తామని స్పష్టం చేస్తోంది. రాజధానిని తరలించిన నేపథ్యంలో అత్యధిక సంస్థలు రాయలసీమకు కేటాయించాలని సీమ టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు వ్యవసాయంపై ప్రధానంగా ఆధారపడిన రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ తక్షణం నిధులను విడుదల చేయాలని కోరుతున్నారు. తెలుగుగంగ, హంద్రీ-నీవా ఫేస్-1, ఎస్సార్బీసి పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తూ శ్రీశైలం జలాశయం వద్ద ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి బానకచెర్లక్రాస్ రెగ్యులేటర్ వరకు శ్రీశైలం కుడి ప్రధాన కాలువ విస్తరణ పనులను పునఃప్రారంభించి 40 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాయలసీమ పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికపుడు చంద్రబాబు తెలుసుకుంటున్నారని వారంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: