ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. ప్రతిపక్షనేతపై మరోసారి ఘటుగా విరుచుకుపడ్డారు. అసెంబ్లీ జగన్ వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఓ కొత్త రాజధాని నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేస్తుంటే.. జగన్ మూర్ఖంగా వ్యవహరిస్తూ.. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అంతేకాదు.. ఓ మహానగరం నిర్మించిన నేతగా చంద్రబాబు.. చరిత్రలో నిలిచిపోతారన్నారు. జగన్ మాత్రం చరిత్రహీనుడిగా నిలుస్తారని తీవ్రవ్యాఖ్యలు చేశారు.                 రుణమాఫీ అంశంపై కూడా జగన్ అవగాహన లేకుండా అనవసర రాద్ధాంతం చేస్తున్నారని దేవినేని ఉమ విమర్శించారు. నిబంధనల ప్రకారం రుణమాఫీ కాని ఒక్కరైతునైనా చూపించాలని తాము సవాల్ చేశామని ఉమ గుర్తు చేశారు. ఐతే తమ సవాల్ స్వీకరించలేక జగన్ అసెంబ్లీ నుంచి పారిపోయారని దెప్పిపొడిచారు. ఐతే ఇక్కడ ఓ విషయం గమనించాలి. అసెంబ్లీలో రుణమాఫీపై చర్చ సందర్బంగా జగన్.. కొన్ని కేస్ స్టడీలు వివరించారు.                                              రుణం పొందిన రైతు ఊరు,పేరు, భూమి వివరాలు, రుణం వివరాలు అన్నీ అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. ఇన్ని చెప్పాక కూడా జగన్.. అసెంబ్లీ నుంచి పారిపోయారని విమర్శించడం విశేషం. రుణమాఫీపై చర్చకు మంత్రులు సరిగ్గా సమాధానం చెప్పలేదని ముఖ్యమంత్రి కూడా ఫీలవుతున్నారు. చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేసేందుకే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కూడా దేవినేని జగన్ పై విమర్శలు చేస్తున్నారని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: